మక్కల వేలంతో రూ.735.2 కోట్ల ఆదాయం
ABN , Publish Date - May 31 , 2026 | 05:19 AM
రాష్ట్రంలో మార్క్‌ఫెడ్ సేకరించిన మొక్కజొన్నల ఈ-వేలంలో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. గత ధరలతో పోలిస్తే ఈసారి అదనంగా 202.56 కోట్ల...
గత ధరలతో పోల్చితే రూ.202.56 కోట్ల అదనపు రాబడి
వెల్లడించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కార్యాలయం
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మార్క్‌ఫెడ్ సేకరించిన మొక్కజొన్నల ఈ-వేలంలో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. గత ధరలతో పోలిస్తే ఈసారి అదనంగా 202.56 కోట్ల రాబడి వచ్చినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 2025-26 వానాకాలం సీజన్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా 78,916 మంది రైతుల నుంచి సేకరించిన 3,80,187 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలకు ఈ వేలం నిర్వహించారు. మే 29న నిర్వహించిన ఈ-వేలంలో టన్నుకు సగటున రూ.19,337 రికార్డు ధర పలికింది. ఇది గతంలో వచ్చిన ధర కంటే టన్నుకు ఏకంగా రూ.5,327 అదనం కావడంతో ప్రభుత్వానికి భారీగా లాభం చేకూరింది. దీంతో మొత్తం నిల్వల వేలంతో ప్రభుత్వానికి రూ.735.20 కోట్ల ఆదాయం వచ్చిందని కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.