రాగిజావ తాగి ఏడుగురు విద్యార్థులకు అస్వస్థత
ABN , Publish Date - Feb 22 , 2026 | 06:31 AM
పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో భాగంగా ఇచ్చిన రాగిజావ తాగి ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
మెదక్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో భాగంగా ఇచ్చిన రాగిజావ తాగి ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని రామాయంపేట బాలుర ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. ఎప్పటిలాగే విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్మికులు శనివారం రాగిజావ ఇచ్చారు. అది తాగిన కొంతమంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్ నాగలక్ష్మి అస్వస్థతకు గురైన ఏడుగురు విద్యార్థులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వారిలో ఆరుగురికి వైద్యులు మందులు ఇచ్చి పంపించగా, ఒకరిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందించారు. ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ లింబాద్రి తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఈవో విజయ తెలిపారు.