Share News

రూ.668 కోట్లతో 7 ఆరోగ్య ప్రాజెక్టులు

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:37 AM

దేశవ్యాప్తంగా ఏడు మెగా ఈఎ్‌సఐసీ ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ప్రారంభించనున్నారు.

రూ.668 కోట్లతో 7 ఆరోగ్య ప్రాజెక్టులు

  • రేపు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ

  • సనత్‌నగర్‌ ఈఎస్ఐసీలో రూ.211 కోట్లతో అత్యాధునిక ఓపీడీని నేరుగా ప్రారంభించనున్న మంత్రి

  • వర్చువల్‌గా ఏపీ, మరో 5 రాష్ట్రాల ప్రాజెక్టుల ప్రారంభం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఏడు మెగా ఈఎ్‌సఐసీ ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ప్రారంభించనున్నారు. తెలంగాణ, ఏపీ సహా ఏడు రాష్ట్రాల్లో రూ.668 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులను మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ నుంచి ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 211.13 కోట్లతో నిర్మించిన సనత్‌నగర్‌ ఈఎస్ఐసీ ఆస్పత్రి కొత్త ఓపీడీ విభాగాన్ని ఆయన నేరుగా ప్రారంభించి.. నిర్మాణ కార్మికులను సత్కరిస్తారు. వారికి నగదు ప్రయోజనాలను పంపిణీ చేస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే కూడా పాల్గొననున్నారు. ఇదే వేదిక నుంచి ఆంధ్రప్రదేశ్‌ సహా మరో ఐదు రాష్ట్రాల ప్రాజెక్టులను వర్చువల్‌ విధానంలో మాండవీయ ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు.


సనత్‌నగర్‌ ఓపీడీ భవనం ప్రత్యేకతలివే..

ఈ మెగా ప్రాజెక్టులో సనత్‌నగర్‌ ఈఎ్‌సఐసీ వైద్య కళాశాల, ఆస్పత్రిలోని కొత్త ఓపీడీ విభాగం ప్రధానమైనది. హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలోని 12,30,183 మంది బీమా చందాదారులకు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన సేవలు అందనున్నాయి.

భవన విస్తీర్ణం: 43,611 చదరపు మీటర్లు

వైద్యసేవలు: జనరల్‌ మెడిసిన్‌, ఈఎన్‌టీ, డెంటల్‌, గైనకాలజీ, నేత్ర, ఆర్థోపెడిక్స్‌, సైకియాట్రీ, చర్మ, ఊపిరితిత్తులు, పీడియాట్రిక్స్‌, జనరల్‌ సర్జరీలతోపాటు ఆయుష్‌ ఓపీడీలు.

పడకలు: 180 సాధారణ పడకలు, 25 ఐసీయూ, 20 ఎన్‌ఐసీయూ పడకలు.

ఇతర వసతులు: ఫిజికల్‌ మెడిసిన్‌, రేడియాలజీ, యోగా కేంద్రం, అధునాతన మందుల దుకాణం, క్లినికల్‌ లెక్చర్‌ థియేటర్‌.

Updated Date - Jul 13 , 2026 | 04:38 AM