Share News

కమీషన్ల కక్కుర్తితో దేశం దాటిన 587 కోట్లు!

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:12 AM

ఒక డిజిటల్‌ అరెస్టు కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అతి పెద్ద వ్యవస్థీకృత సైబర్‌ నెట్‌వర్క్‌ మూలాలను వె లికితీశారు.

కమీషన్ల కక్కుర్తితో దేశం దాటిన 587 కోట్లు!

  • 330 మంది బాధితుల నుంచి సైబర్‌ కేటుగాళ్ల లూటీ.. ముందు వేలాది మ్యూల్‌ ఖాతాల్లోకి డబ్బు మళ్లింపు

  • 61,448 లావాదేవీలతో నగదు డిపాజిట్‌ యంత్రాల్లో జమ

  • షెల్‌ కంపెనీల ఖాతాల్లోకి.. ఆపై విదేశీ కరెన్సీగా మార్పు

  • చివరకు మనీ చేంజర్ల ద్వారా దేశం దాటించిన ముఠా

  • కమీషన్ల కోసం ఖాతాలిచ్చి సహకరించిన వేలాది మంది..

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఒక డిజిటల్‌ అరెస్టు కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అతి పెద్ద వ్యవస్థీకృత సైబర్‌ నెట్‌వర్క్‌ మూలాలను వె లికితీశారు. తెలంగాణ, ఏపీతో పాటు 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించిన సైబర్‌ నెట్‌వర్క్‌లో కీలక భాగస్వామ్యులను గుర్తించారు. డిజిటల్‌ అరెస్టులు, పెట్టుబడి మోసాల ద్వారా కొల్లగొట్టిన రూ.వందల కోట్ల సొమ్మును ఏ విధంగా విదేశాలకు తరలిస్తున్నారనే సమగ్ర ‘మనీ ట్రయల్‌’ను ఈడీ అధికారులు బట్టబయలు చేశారు. ఈడీ విచారణలో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగుచూసిన నేపఽథ్యంలో కేంద్ర హోంశాఖ ప్రతి నెలా ప్రగతి సమీక్షలో సైబర్‌ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 330 మంది బాధితులు.. నష్టపోయింది అక్షరాల రూ.587 కోట్లు.. వారి నుంచి సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బును నేరుగా విదేశాలకు తరలించలేదు. పోలీసులకు చిక్కకుండా పక్కా ప్రణాళికతో అంచెలంచెల వ్యవస్థలను రూపొందించారు. ముందుగా వేలాది మ్యూల్‌ బ్యాంకు ఖాతాల్లోకి ఆ డబ్బును తిప్పారు. అక్కడి నుంచి నగదు రూపంలోకి మార్చారు. మళ్లీ ఆ నగదును క్యాష్‌ డిపాజిట్‌ యంత్రాల ద్వారా షెల్‌ కంపెనీల్లోకి మళ్లించారు. ఆపై విదేశీ కరెన్సీగా మార్చి దేశం దాటించారు.


ఒక్కో దశకు ఒక్కో వ్యవస్థ..

ఇక ఈ మొత్తం వ్యవహరం వెనుక ఉన్నది సాధారణ సైబర్‌ ముఠా కాదు.. బాధితుడి ఖాతా నుంచి విదేశాలకు డబ్బు చేరే వరకు ఒక్కో దశకు ఒక్కో వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న వ్యవస్థీకృత నేర నెట్‌వర్క్‌. ఇందులో సైబర్‌ నేరగాళ్లతో పాటు బ్యాంకు ఖాతాలు సమకూర్చేవారు, నగదు తీసేవారు, నగదు డిపాజిట్‌ చేసేవారు, షెల్‌ కంపెనీలు నిర్వహించే వారు, మనీ చేంజర్ల వరకు అనేక స్థాయుల్లో వ్యక్తుల సహకారం బయడపడటం దర్యాప్తు బృందాలను కలవరానికి గురిచే స్తోంది. బాధితుల నుంచి కొల్లగొట్టిన రూ.587 కోట్లను ఒకట్రెండు ఖాతాల్లో ఉంచితే దర్యాప్తు సంస్థలకు సులభంగా చిక్కుతామని భావించిన సైబర్‌ నేరగాళ్లు.. సొమ్మును వేలాది ఖాతాల్లోకి విడగొట్టి బదిలీ చేశారు. ఒక్కో ఖాతాకు కొంత మొత్తం చొప్పున పంపుతూ డబ్బు అసలు మూలాన్ని గుర్తించడం దర్యాప్తు అధికారులకు కష్టమయ్యేలా చేశారు. ఈడీ అధికారులు గుర్తించిన ఖాతాలన్నీ కమీషన్‌కు ఆశ పడి తమ బ్యాంకు ఖాతాలను ఇచ్చిన వారివే. షెల్‌ కంపెనీలను మాత్రం ఈ నేరం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చే సుకున్నారు. ఈ నెట్‌వర్క్‌లో అత్యంత కీలకమైన అంశంగా రూ.587 కోట్లు షెల్‌ కంపెనీలకు ఎలా చేరాయన్నది నిలిచింది. సైబర్‌ నేరగాళ్లు మొత్తం 61,448 లావాదేవీల ద్వారా క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్లలో రూ.587 కోట్లను 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డిపాజిట్లు చేశారు. స్వల్ప మొత్తాల్లో డబ్బు డిపాజిట్‌ చేయడం ద్వారా అనుమానం రాకుండా చూసుకోవడంతో పాటు మనీ ట్రయల్‌ను దర్యాప్తు సంస్థలు గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏర్పాటు చేసుకున్న షెల్‌ కంపెనీల్లోకి డబ్బు చేరిన తర్వాత ప్రతి రూపాయిని చట్టబద్దమైన మనీ చేంజర్ల ద్వారా విదేశీ కరెన్సీగా మార్చి విదేశాల్లోని సైబర్‌ నేరగాళ్లకు పంపారు.


ఖాతాలిచ్చి కారాగారానికి భారతీయులు..

ఈ భారీ వ్యవస్థీకృత నేరంలో సైబర్‌ కేటుగాళ్లు విదేశాల్లో ఉంటే కమీషన్ల ఆశతో వారికి సహకరించింది.. స్వల్ప మొత్తానికి ఖాతాలిచ్చి జైలు పాలవుతోంది భారతీయులే.. దీంతో తొలి దశలో మ్యూల్‌ ఖాతాలను సైబర్‌ నెట్‌వర్క్‌కు అందకుండా చేయాలని అవగాహన కార్యక్రమం చేపట్టామని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖాగోయల్‌ తెలిపారు. ఈడీ ఛేదించిన ఈ నెట్‌వర్క్‌లో డబ్బు దోచుకుంది మయన్మార్‌ కేంద్రంగా పనిచేస్తున్న చైనా దేశీయులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ స్థాయి నెట్‌వర్క్‌ నిర్వహణ వెనుక దేశంలో సహకరిస్తున్న కింగ్‌పిన్‌లను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఆదేశాలతో వివిధ రాష్ట్ర పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. ఇది ఈడీ ఛేదించిన ఒక మనీట్రయల్‌ మాత్రమేనని, దేశవ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన మరో రూ.2,904 కోట్ల అనుమానాస్పద నగదు డిపాజిట్లపై ముమ్మర దర్యాప్తు సాగుతోందని ఈడీ తెలిపింది.

Updated Date - Aug 29 , 2026 | 04:13 AM