Share News

15-49 ఏళ్ల మహిళల్లో 57శాతం మందికి రక్తహీనత

ABN , Publish Date - May 17 , 2026 | 05:30 AM

దేశంలో 15-49 ఏళ్ల మహిళల్లో సుమారు 57 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే..

15-49 ఏళ్ల మహిళల్లో  57శాతం మందికి రక్తహీనత

  • అపోలో ఆస్పత్రుల జేఎండీ డాక్టర్‌ సంగీతా రెడ్డి

  • అధిక రుతుస్రావం సాధారణ విషయం కాదు

  • సీనియర్‌ కన్సల్టెంట్‌ గైనకాలజిస్టుల హెచ్చరిక

హైదరాబాద్‌ సిటీ, మే 16 (ఆంధ్రజ్యోతి): దేశంలో 15-49 ఏళ్ల మహిళల్లో సుమారు 57 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5) గణాంకాలు సూచిస్తున్నాయని అపోలో ఆస్పత్రుల జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతారెడ్డి తెలిపారు. అపోలో ఆస్పత్రిలో శనివారం ప్రారంభమైన ఆసియన్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌ ఆన్‌ ఫైబ్రాయిడ్స్‌లో దేశ విదేశాల నుంచి వచ్చిన గైనకాలజీ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగీతారెడ్డి మాట్లాడుతూ.. మహిళలు దీర్ఘకాలంగా అధిక రుతుస్రావం, అలసట, రక్తహీనతతో బాధపడుతున్నా చాలామంది దానిని సాధారణంగా తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక రుతుస్రావం సాధారణ విషయం కాదని, దాని వెనుక గర్భాశయ ఫైబ్రాయిడ్స్‌ వంటి సమస్యలు ఉండొచ్చని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఈ సందర్బంగా సీనియర్‌ కన్సల్టెంట్‌ గైనకాలజిస్టు డాక్టర్‌ రూమాసిన్హా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో రోబోటిక్‌ సర్జరీ, లాపరోస్కోపీ, హిస్టెరోస్కోపీ, ఏఐ ఆధారిత ఇమేజింగ్‌, గర్భాశయాన్ని కాపాడే చికిత్సా విధానాలపై ప్రత్యేక చర్చలు జరిగాయి. ఫైబ్రాయిడ్స్‌ ఉన్న మహిళలకు గర్భాశయం తొలగింపు మాత్రమే మార్గం కాదని, హిస్టరెక్టమీతో పాటు మయోమెక్టమీ వంటి ప్రత్యామ్నాయాలపై కూడా మహిళలకు అవగాహన కల్పించాలని నిపుణులు సూచించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ, ఫైబ్రాయిడ్స్‌ త్వరగా గుర్తించడం, ఆధునిక చికిత్సలపై సమావేశంలో చర్చించారు. సదస్సులో భాగంగా ఆదివారం ’రెడ్‌ స్ట్రెంగ్త్‌ వాక్‌‘ నిర్వహించి అధిక రుతుస్రావం, రక్తహీనతపై మహిళల్లో అవగాహన కల్పించనున్నారు.

Updated Date - May 17 , 2026 | 05:31 AM