Share News

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:46 AM

దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు చట్టసభలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్‌ చేశారు.

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు

  • బీసీల మేధో మదన సదస్సులో తెలుగు రాష్ట్రాల ఎంపీల డిమాండ్‌

  • ఏప్రిల్‌లో 10 లక్షల మందితో బీసీ గర్జన : ఆర్‌ కృష్ణయ్య

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు చట్టసభలలో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్‌ చేశారు. కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని కోరారు. విద్య, ఉద్యోగ, రిజర్వేషన్లపై ఉన్న బీసీ క్రిమిలేయర్‌ను తొలగించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏపీ, తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బీసీల మేధోమదన సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. మారేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బీజేపీ ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, పాకా సత్యనారాయణ, టీడీపీ ఎంపీలు బీద మస్తాన్‌రావు, కలిశెట్టి అప్పలనాయుడు, బస్తీపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల డిమాండ్ల సాధన, ఆత్మగౌరవం కోసం బీసీలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏప్రిల్‌లో 10 లక్షల మందితో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా బీసీ గర్జన బహిరంగ సభను నిర్వహించబోతున్నామని తెలిపారు. బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్ట్‌ను తీసుకురావాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కాగా, కేంద్రం రూ.2 లక్షల కోట్లతో బడ్జెట్‌లో బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని పాకా సత్యనారాయణ కోరారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు నేటికీ అందని ద్రాక్షలాగా ఉండటం దురదృష్టకరమని ఎంపీ బస్తీపాటి నాగరాజు అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో చట్టసభలలో బీసీలకు సరైన న్యాయం జరగాలంటే పార్లమెంట్‌లో బీసీ బిల్లును ఆమోదించాలని, దేశవ్యాప్తంగా కులగణన త్వరితగతిన చేపట్టాలని ఎన్‌.మారే్‌ష డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 12 , 2026 | 12:46 AM