మూసాపేటలో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:08 AM
మూసాపేట గూడ్స్‌షెడ్డు రోడ్డులోని జనతానగర్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయం త్రం నాలుగు గంటల సమయంలో విద్యుత్తు ద్విచక్ర వాహనాలు...
ఈవీ బైక్‌ల గోదాంలో మంటలు.. 50 వాహనాలు దగ్ధం
మూసాపేట, జూన్ 16(ఆంధ్రజ్యోతి): మూసాపేట గూడ్స్‌షెడ్డు రోడ్డులోని జనతానగర్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయం త్రం నాలుగు గంటల సమయంలో విద్యుత్తు ద్విచక్ర వాహనాలు (ఈవీ బైక్‌లు) ఉంచిన గోదాంలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడి 50 బళ్లు బూడిదయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ పీక్వీయూ కంపెనీకి చెందిన సుమారు 50 ఎలక్ట్రికల్ బైక్‌లు పూర్తిగా మంటలకు ఆహుతి అయ్యాయి. గోదాం అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు నాలుగు అగ్నిమాపక శకటాలు వచ్చాయి. విద్యుత్, వైద్యశాఖ సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఎలాంటి ప్రాణనష్టం కలగకుండా చూశారని కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు. బ్యాటరీల షార్టుసర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు ప్రాథమికంగా నిర్థారించారని చెప్పారు.