సగం దరఖాస్తులు తిరస్కరించారు!
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:57 AM
ధరణి పోర్టల్‌లో లోపాలను సవరిస్తూ, సరికొత్త సాంకేతికతతో రాష్ట్రంలో 2025 ఏప్రిల్ 17న భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ భూ సమస్యలు కొత్త చట్టంతో పరిష్కారమవుతాయని....
భూ సమస్యలపై 9.80 లక్షల దరఖాస్తులు.. అందులో సగం వెనక్కి
సాంకేతిక కారణాలతో తిరస్కరణ
శాపంగా మారిన ఆటోమేటిక్ రిజెక్షన్
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లో లోపాలను సవరిస్తూ, సరికొత్త సాంకేతికతతో రాష్ట్రంలో 2025 ఏప్రిల్ 17న భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ భూ సమస్యలు కొత్త చట్టంతో పరిష్కారమవుతాయని రైతులు, ప్రజలు ఆశించారు. రెవెన్యూ సదస్సుల్లో రైతులు భారీ సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకున్నారు. తమ సమస్యలకు పరిష్కారం చూపాల్సిన అధికారులు.. న్యాయపరమైన చిక్కులు ఉన్నాయనే సాకుతోపాటు ఇతరత్రా కారణాలతో అకారణంగా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో భూ రికార్డుల శాశ్వత పరిష్కారం కోసం పాత పోర్టల్‌లో ఉన్న 30కి పైగా మాడ్యూళ్లను సరళీకరించి, కలెక్టర్లకు ప్రత్యేక ట్రైబ్యునల్ వ్యవస్థ ద్వారా చట్టపరమైన అధికారాలు కల్పిస్తూ.. సమస్యలకు పరిష్కారం చూపుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టం అమల్లోకి వచ్చి 14 నెలలైంది. కానీ, అత్యధిక దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భూ సమస్యల మీద రెవెన్యూ అధికారులకు మొత్తం 9.80 లక్షల దరఖాస్తులు అందాయి. వాటిలో పరిష్కరించినవి కేవలం 3.10 లక్షలు. అంటే మొత్తం దరఖాస్తుల్లో పరిష్కారమైనవి 31.6 శాతం. వివిధ కారణాలతో తిరస్కరించిన దరఖాస్తులు 4.80 లక్షలు (49శాతం). అంటే దాదాపు సగం దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా వివిధ స్థాయుల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు 1.90 లక్షలు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చాక దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం దొరికినా.. సాంకేతిక కారణాల వల్ల 49 శాతం దరఖాస్తులను నేరుగా తిరస్కరించడం గమనార్హం.
అత్యధిక దరఖాస్తులు ఈ సమస్యలపైనే..
ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అత్యధిక దరఖాస్తులు నాలుగు సమస్యలపై వచ్చాయి. పార్ట్ బీలో ఉన్న భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలపైనే 38 శాతం దరఖాస్తులు ఉన్నాయి. పాత రికార్డులు ధరణికి బదిలీ అయ్యే సమయంలో తప్పుగా 22ఏలో పడిన పట్టా భూములను విడిపించుకునేందుకు గత ఏడాది మే, జూన్‌లో రైతులు భారీగా దరఖాస్తులు పెట్టుకున్నారు. భూభారతి డిజిటల్ పాస్ పుస్తకాల్లో విస్తీర్ణంలో లోపాలు ఉన్నాయంటూ 24 శాతం దరఖాస్తులు వచ్చాయి. పోర్టల్‌లో సాంకేతిక మార్పుల వల్ల గుంటలు, ఎకరాల్లో విస్తీర్ణం తగ్గిందని గుర్తించిన రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇక వారసత్వ, ఉమ్మడి ఖాతాలకు సంబంధించి సమస్య పరిష్కారాన్ని కోరుతూ 20 శాతం దరఖాస్తులు వచ్చాయి. యజమానులు చనిపోయిన భూములను వారసుల పేరుతో మార్చడానికి కొత్త పోర్టల్‌లో బయోమెట్రిక్, ఆధార్ అనుసంధానం ప్రక్రియలో తలెత్తిన లోపాల వల్ల ఈ దరఖాస్తులు పెట్టుకున్నారు. అసైన్డ్, లావుణి వివాదాలకు సంబంధించి యాజమాన్య హక్కులు కావాలని మొత్తం 18 శాతం దరఖాస్తులు వచ్చాయి. దశాబ్దాలుగా సాగులో ఉన్న భూములపై వారసత్వ హక్కులు బదిలీ కాకపోవడంతో రైతులు అధికారులను ఆశ్రయించారు.
తిరస్కరణలో అగ్రస్థానంలో ఐదు జిల్లాలు
దరఖాస్తుల తిరస్కరణను పరిశీలిస్తే అగ్రస్థానంలో ఐదు జిల్లాలు ఉన్నాయి. అత్యధిక దరఖాస్తులను తిరస్కరిస్తున్న జిల్లాల జాబితాలో రంగారెడ్డి, మేడ్చల్ ముందు వరసలో నిలిచాయి. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల విలువలు భారీగా పెరగడం వల్ల ఒకే భూమిపై రెండుమూడు రిజిస్ట్రేషన్లు ఉండడం, కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండడంతో అధికారులకు ఏ చిన్న అనుమానం వచ్చినా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో 56 శాతం దరఖాస్తులను తిరస్కరించడం గమనార్హం. ఇక సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక్కడ మొత్తం దరఖాస్తుల్లో 52 శాతం తిరస్కరించారు. పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ కారిడార్లుగా ఉన్న ఈ జిల్లాల్లో నాలా కన్వర్టు అయిన భూములు, వ్యవసాయ భూముల రికార్డుల మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయనే కారణంతో అధికారులు నిర్ణయం తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సరైన లింకు డాక్యుమెంట్లు లేవని సగానికిపైగా దరఖాస్తులను తిరస్కరించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వచ్చిన దరఖాస్తుల్లో 48 శాతం తిరస్కరించారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో జాగీర్, ఇనాం భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. భూభారతి నిబంధనల ప్రకారం.. ఇనాం భూముల సవరణకు ఆర్డీవో స్థాయి దాటి ఫైల్ నడవాల్సి ఉండడంతో క్షేత్ర స్థాయి అధికారులు ఆ తలనొప్పి తమకెందుకన్న భావనతో తిరస్కరణకే మొగ్గు చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో వచ్చిన దరఖాస్తుల్లో 45 శాతం తిరస్కరించారు. గ్రామాల్లో ఉమ్మడిగా సాగు చేస్తున్న భూములకు సంబంధించి, కుటుంబ సభ్యులందరి ఆమోద పత్రాలు లేవనే కారణంతో దరఖాస్తులు తిరస్కరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కొంప ముంచుతున్న ఆటోమేటిక్ రిజెక్షన్
భూభారతిలో పారదర్శకత పెంచేందుకు అమల్లోకి తీసుకొచ్చిన కొన్ని నిబంధనలు కూడా రైతులకు శాపంగా మారుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఆటోమేటిక్ రిజెక్షన్ ఒకటి. ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌లో దరఖాస్తు చేసిన 30-45 రోజుల్లో క్షేత్ర స్థాయి నివేదిక ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాకపోతే, సిస్టమ్ ఆటోమేటిక్‌గా దరఖాస్తును తిరస్కరించేలా ప్రోగ్రామింగ్ చేశారు. దీంతో వేలాది దరఖాస్తులు రద్దయిపోయాయి. కొత్త చట్టంలో 70శాతం కీలక అధికారాలు కలెక్టర్లకు కేటాయించారు. ఒక జిల్లా కలెక్టర్ రోజుకు వందల ఫైళ్లను భౌతికంగా, డిజిటల్ రూపంలో పరిశీలించాల్సి ఉంటుంది. ఇది సాధ్యం కాకపోవడంతో కింది స్థాయి అధికారులు పంపే నెగెటివ్ నివేదికల ఆధారంగా తిరస్కరణ ముద్ర వేసేస్తున్నారు. ఇక ఈ-కేవైసీ కఠినంగా ఉండడం కూడా సమస్యల పరిష్కారానికి అవరోధంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. భూ యజమానులు ఆధార్, పాస్ పుస్తకంలోని పేర్లు, అక్షరాలతో సహా సరిపోలాలనే నిబంధన ఉంది. పాత రికార్డుల్లో పేర్లు తప్పుగా ఉండడం వల్ల ఈ-కేవైసీ పూర్తవక, దరఖాస్తులు నిలిచిపోయి తిరస్కరణకు గురవుతున్నాయని రైతులు చెబుతున్నారు.