పాలమూరు ప్రాజెక్టులకు రూ.47,130 కోట్లు అవసరం!
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:41 AM
నిధుల లేమి కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు, 1,226 గ్రామాలకు తాగు నీరు లక్ష్యంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల......
అందులో ‘పాలమూరు-రంగారెడ్డి’ పనులకే రూ.40,600 కోట్లు.. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా తదితర ప్రాజెక్టులకు 6,530 కోట్లు
రేపు, ఎల్లుండి ప్రాజెక్టులను సందర్శించనున్న సీఎం రేవంత్
ఫాస్ట్ ట్రాక్ విధానంలో పాలమూరు ప్రాజెక్టుల పూర్తి: ఉత్తమ్
మహబూబ్‌నగర్/హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): నిధుల లేమి కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు, 1,226 గ్రామాలకు తాగు నీరు లక్ష్యంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులకు కావాల్సింది కొండంత అయితే బడ్జెట్‌లో గోరంత కేటాయింపులే జరుగుతున్నాయి. తాజా బడ్జెట్‌లోనూ కేవలం రూ.1,800 కోట్లే దక్కాయి. పాలమూరు-రంగారెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, రాజీవ్ బీమా, తుమ్మిళ్ల, గట్టు, కొడంగల్ ఎత్తిపోతల పథకాలకు కలిపి సుమారు రూ.47,130 కోట్లు అవసరం కానున్నాయి. ఇందులో అత్యధికంగా పాలమూరు-రంగారెడ్డికే రూ.40,600 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఇందులో ఫేజ్-1 పనులకే రూ.19,385 కోట్లు కావాలని పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు తర్వాత అత్యధికంగా రూ.4,175 కోట్లు మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అవసరం కానున్నాయి. ఇవికాకుండా మిగిలిన ప్రాజెక్టులకు రూ.1,815.83 కోట్లు ఖర్చు చేస్తే 2.46 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మొత్తం పాలమూరు ప్రాజెక్టులన్నీ ఈ టర్మ్‌లోనే పూర్తి చేస్తామని అటు సీఎం, ఇటు నీటిపారుదలశాఖ మంత్రి చెబుతుండగా సాగునీటి అనుమతులు లేని పాలమూరు-రంగరెడ్డి ప్రాజెక్టుకు నిధుల సమీకరణ ఎలా చేస్తారనేది తెలియడం లేదు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 4, 5వ తేదీల్లో సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శన ప్రాధాన్యతను సంతరించుకుంది.
సీఎం పర్యటన మైలురాయి కానుంది: ఉత్తమ్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో మంగవారం జలసౌధలో అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రి జూపల్లి కృష్ణారావు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హాజరయ్యారు. సీఎం పర్యటన ప్రాజెక్టుల నిర్మాణంలో ఒక మైలురాయిగా నిలువనుందని ఉత్తమ్ చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్ జాబితాలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిధులు విడుదల చేసి, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేస్తారన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో కరువు పీడిత ప్రాంతాలకు సాగు నీటితో పాటు తాగునీటిని అందిస్తామని వెల్లడించారు. ప్రాజెక్టుల పూర్తితో జిల్లాల స్వరూపమే మారనుందన్నారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులూ పాల్గొంటారని తెలిపారు. సీఎం సమీక్ష సందర్భంగా అధికారులు సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, రాజీవ్ బీమా, నెట్టెంపాడు వంటి కీలక ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వాలన్నారు. ఈనెల 4న సాయంత్రం సోమశిలలో ప్రజెంటేషన్ సెషన్ ఉంటుందన్నారు. సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉంటే.. అప్పటికప్పుడే సీఎం కూడా పనుల పూర్తికి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశముంటుందని చెప్పారు.