Share News

47 మంది మావోయిస్టుల లొంగుబాటు

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:59 AM

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 47మంది మావోయిస్టులు డీజీపీ శివధర్‌ రెడ్డి సమక్షంలో శనివారం లొంగిపోయారు. దక్షిణ బస్తర్‌ డి విజన్‌ కమిటీ ఇన్‌చార్జి హేమ్లా ఐతు అలియాస్‌ విజ్జా ...

47 మంది మావోయిస్టుల లొంగుబాటు

  • డీజీపీ సమక్షంలో లొంగిపోయిన దక్షిణ బస్తర్‌.. డివిజన్‌ కమిటీ ఇన్‌చార్జి హేమ్లా ఐతు బృందం

  • ఆ పార్టీలో మిగిలిన తెలంగాణ వారు నలుగురే

  • ఆయుధాల డంప్‌ల కోసం గాలిస్తున్నాం: డీజీపీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 47మంది మావోయిస్టులు డీజీపీ శివధర్‌ రెడ్డి సమక్షంలో శనివారం లొంగిపోయారు. దక్షిణ బస్తర్‌ డి విజన్‌ కమిటీ ఇన్‌చార్జి హేమ్లా ఐతు అలియాస్‌ విజ్జా తన బృందంతో కలిసి లొంగిపోవడంతో దక్షిణ బస్తర్‌ డివిజన్‌ కమిటీ, పీఎల్‌జీఏ బెటాలియన్‌-1 కనుమరుగైనట్టేనని డీజీపీ తెలిపారు. వీరి లొంగుబాటుతో ఛత్తీస్‌గఢ్‌ సైతం మావోయిస్టు రహిత రాష్ట్రమైందని, తెలంగాణలోనైతే ఒక్క మావోయిస్టు కూడా అడవుల్లో లేరని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు గణపతి ఆయన భార్య రత్నాభాయి, ఒడిశాలో పనిచేస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్‌ సంతోష్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు వార్తా శేఖర్‌ అలియాస్‌ మంగ్తు మాత్రమే జనజీవన స్రవంతిలో కలవాల్సి ఉందన్నారు. గణపతి ఆయన భార్య మాత్రం అడవుల్లో లేరన్న సమాచారం ఉందన్నారు. 2023లో కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో తెలంగాణకు చెందిన వారు 125 మంది ఉంటే ప్రస్తుతం నలుగురే మిగిలారని వివరించారు. శనివారం లొంగిపోయిన వారికి తాత్కలికంగా ఒకొక్కరికి రూ.25వేలు ఇచ్చామని, బ్యాంకు ఖాతాలు తెరిచిన తర్వాత నిబంధనల ప్రకారం వారిపై ఉన్న రివార్డులు అందజేస్తామని చెప్పారు. మావోయిస్టుల ఆయుధాల డంప్‌ల కోసం బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయని తెలిపారు. తెలంగాణను మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించడానికి కృషి చేస్తున్న అధికారులను డీజీపీ ప్రశంసించారు. మావోయిస్టు పార్టీ పేరిట విడుదలైన లేఖ ఉత్తరాది నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు.


దేవ్‌జీ, సోనూ.. విప్లవ ద్రోహులే!

  • మావోయిస్టు పార్టీ ఎన్‌సీసీ కమిటీ పేరిట లేఖ

మావోయిస్టు పార్టీ ఉత్తర సమన్వయ కమిటీ (ఎన్‌సీసీ) పేరిట ఉన్న లేఖ ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉద్యమాన్ని వ్యతిరేకించడానికి లేదా పార్టీని రద్దు చేయడానికి చట్టబద్ధమైన మార్గాలను ఆశ్రయించేవారు పార్టీకి బద్ధ శతువ్రులని.. దేవ్‌జీ, సోనూలను విప్లవ ద్రోహులుగా పరిగణిస్తున్నామని అందులో పేర్కొన్నారు. దేశంలో విప్లవ కమ్యూనిస్టు ఉద్యమం ఇంతటి తీవ్రమైన ఎదురు దెబ్బను ఎదుర్కోవడం ఇది మొదటి సారి కాదని, 1970లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని గుర్తు చేశారు. ప్రస్తు తం తాము ఇప్పటీకీ కమిటీలకు నాయకత్వం వహిస్తున్నామని, కేంద్ర కమిటీ వ్యూహాత్మక ప్రాంతాల్లో ప్రజా యుద్ధానికి సారథ్యం వహిస్తోందని ఎన్‌సీసీ కమిటీ ఆ లేఖలో పేర్కొంది. కాగా, ఝార్ఖండ్‌లోని సింగ్‌భూమ్‌ జిల్లా గోయిల్కేరా పరిధిలో ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలతో రమేష్‌ అనే వ్యక్తిని మావోయిస్టులు శనివా రం హత్య చేశారు. ఘటనతో.. ఝార్ఖండ్‌లో కేంద్ర బలగాలు కూబింగ్‌ ప్రారంభించాయి.

Updated Date - Apr 26 , 2026 | 04:59 AM