టిమ్స్‌లకు 4,588 పోస్టులు!
ABN , Publish Date - Mar 05 , 2026 | 02:26 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (టిమ్స్) ఆస్పత్రుల నిర్మాణం దాదాపు పూర్తి కావటంతో..
కొత్త ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదన
ఆర్థికశాఖ ఆమోదం కోసం ఎదురుచూపు
వీటిలో 1200 స్పెషలిస్టు వైద్యుల పోస్టులు
మిగతావి నర్సులు, పారామెడికల్ సిబ్బంది
ఆస్పత్రుల నిర్వహణ సిబ్బంది భర్తీకి కసరత్తు
ఔట్‌సోర్సింగ్ విధానంలో నియామకాలు
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (టిమ్స్) ఆస్పత్రుల నిర్మాణం దాదాపు పూర్తి కావటంతో.. వాటికి అవసరమైన ఉద్యోగాల భర్తీకి వైద్యారోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న మూడు కొత్త టిమ్స్ ఆస్పత్రులకు 4,588 మంది వైద్యులు, సిబ్బంది అవసరమని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఈ పోస్టుల్లో సుమారు 1,200 మంది స్పెషలిస్టు వైద్యులు ఉండగా.. మిగిలినవినర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులు ఉన్నాయి. అలాగే ఆస్పత్రి నిర్వహణ, సెక్యూరిటీ, శానిటేషన్ వంటి విభాగాల్లో అవసరమైన మేర ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలని కూడా వైద్యశాఖ ప్రతిపాదించింది. ఈ మూడు టిమ్స్ ఆస్పత్రుల్లో ఉద్యోగాల నియామకం ఎలా చేపట్టాలన్న విషయంపై వైద్యశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వైద్యశాఖలో వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది నియామకాలను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా చేపడుతున్నారు. ఈ బోర్డు నిర్వహించే రాత పరీక్ష, ఇతర అర్హతల వెయిటేజీఆధారంగా ఎంపిక చేస్తున్నారు. అయితే, ఉద్యోగంలో చేరిన తర్వాత వీరిలో చాలామంది బదిలీలు, డిప్యుటేషన్, ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్ పేరుతో తరచూ హైదరాబాద్ లేదా పట్టణ ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రభుత్వ ఆస్పత్రుల్లా కాకుండా నిమ్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా టిమ్స్‌ను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం నిమ్స్‌లో వైద్యులు, పారామెడికల్, వైద్యేతర సిబ్బంది నియామకాలను ఆ ఆస్పత్రే స్వయంగా భర్తీ చేసుకుంటోంది. అలాగే అక్కడ పనిచేయాలంటే కచ్చితంగా ప్రైవేటు ప్రాక్టీస్ చేయకూడదన్న నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. టిమ్స్‌లలో కూడా నియామకాలను ఆస్పత్రులు వేటికవే చేపట్టేలా ఏర్పాటు చేయాలని సర్కారు ఆలోచిస్తోంది. బదిలీలకు అవకాశం లేకుండా కేవలం ఆయా ఆస్పత్రులకే పరిమితమయ్యేలా శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ విధానం వల్ల నిపుణులైన వైద్యులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోకుండా, టిమ్స్‌ల స్థాయిని పెంచే అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో సర్కారు ఉంది.