Share News

మేడారం జాతరకు 4 వేల ఆర్టీసీ బస్సులు

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:58 AM

ములుగు జిల్లాలోని మేడారం జాతరకు వెళ్లే భక్తుల ప్రయాణానికి టీజీఎ్‌సఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశా రు.

మేడారం జాతరకు 4 వేల ఆర్టీసీ బస్సులు

  • మొత్తం 51 పాయింట్ల నుంచి జాతరకు..

  • 20 లక్షల మంది ప్రయాణించవచ్చని అంచనా

  • అందుకు తగ్గట్లుగా ఆర్టీసీ ఏర్పాట్లు

  • మేడారంలో 50 ఎకరాల్లో తాత్కాలిక బస్‌స్టేషన్‌

హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లాలోని మేడారం జాతరకు వెళ్లే భక్తుల ప్రయాణానికి టీజీఎ్‌సఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశా రు. ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు హైదరాబాద్‌ సహా 51 పాయింట్ల నుంచి మొత్తం4 వేల బస్సులను జాతరకు నడపనున్నారు. ఈసారి జాతర సమయంలో 20 లక్షల మంది ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా మేడారంలో ఏర్పాట్లు చేశారు. 2024లో జాతర కోసం ఆర్టీసీ 3,491 బస్సులు నడిపి 16.82 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించింది. జాతర సందర్భంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, హైదరాబాద్‌ నగరం నుంచి మొత్తం 51 ట్రాఫిక్‌ జనరేటింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. మేడారంలో 50 ఎకరాల్లో తాత్కాలిక బస్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. భక్తులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం 9 కి.మీ పొడవు కలిగిన 50 క్యూలైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్లలో ఒకేసారి 20వేల మంది ప్రయాణికులు నిలబడే అవకాశం ఉంది. ప్రయాణికులు వేచిఉండే ప్రాంతం, సిబ్బంది విశ్రాంతి గదులు, నిర్వహణ కార్యకలాపాల కోసం 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక షెడ్లను నిర్మించారు. 1,000 బస్సుల పార్కింగ్‌కు వీలుగా 25.76 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. 10,000 మంది సిబ్బంది వారం రోజుల పాటు పనిచేయనున్నారు.

భక్తులకు ఇబ్బందులు కలగొద్దు: పొన్నం

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ పకడ్బందీ చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ క్యూలైన్ల వద్ద గందరగోళం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. కాగా, జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ సేవల్ని వినియోగించుకోవాలని వరంగల్‌ రీజియన్‌ ఆర్‌ఎం విజయ భాను సూచించారు.

Updated Date - Jan 21 , 2026 | 04:58 AM