Share News

కూరగాయల మాటున గంజాయి స్మగ్లింగ్‌

ABN , Publish Date - May 12 , 2026 | 04:33 AM

ఎవరికీ అనుమానం రాకుండా కూరగాయల సంచుల్లో గంజాయి పెట్టి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌, పటాన్‌చెరు ఎస్‌వోటీ పోలీసులు సోమవారం పట్టుకున్నారు.

కూరగాయల మాటున గంజాయి స్మగ్లింగ్‌

  • ఒడిశా నుంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు

  • ఏడుగురి అరెస్టు.. 400 కేజీల గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ/పటాన్‌చెరు మే 11 (ఆంధ్రజ్యోతి): ఎవరికీ అనుమానం రాకుండా కూరగాయల సంచుల్లో గంజాయి పెట్టి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌, పటాన్‌చెరు ఎస్‌వోటీ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ. 2 కోట్ల విలువైన 400 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ శ్రీనివా్‌సరావు తెలిపారు. మహారాష్ట్రలోని సోలాపుర్‌, పండర్‌పుర్‌ ప్రాంతాలకు చెందిన ప్రతాప్‌ హరిదాస్‌ పవార్‌, ఆనంద్‌ మయప్ప, బాలాజీ గణేశ్‌, రోహిత్‌ హోవాల్‌, చందన్‌ షిప్వే ఆడుంబర్‌, చందాశివే సాహిల్‌, రంజీత్‌ గడాగే తదితరులు ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతం నుంచి గంజాయిని హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. డీసీఎం వ్యాన్‌లో కూరగాయల లోడ్‌లా కనిపించే విధంగా తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి, పటాన్‌చెరు పోలీసుల సహకారంతో ఎస్‌వోటీ విభాగం పోలీసులు ముత్తంగి వద్ద ఓఆర్‌ఆర్‌పై తనిఖీలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో కూరగాయల సంచుల్లో లభించిన 400 కేజీల ఎండు గంజాయితో పాటు గంజాయి తరలించే వాహనం, ఎస్కార్ట్‌గా ఉపయోగించిన మరో కారు, ఆరు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేయగా, మరో ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ శ్రీనివా్‌సరావు తెలిపారు.

Updated Date - May 12 , 2026 | 04:33 AM