Share News

36 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూపు

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:56 AM

భారత వాయుసేనకు అవసరమైన ఎవియోనిక్స్‌, క్షిపణుల నేవిగేషన్‌ వ్యవస్థల అభివృద్ధి కోసం ఏర్పాటైంది అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌....

36 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూపు

  • ఏఆర్‌సీఐ కోసం 1991లో 95 కుటుంబాల నుంచి 95 ఎకరాల భూమి స్వాధీనం

  • 40 మందికి కొలువులు.. మిగతా 55 కుటుంబాల పట్ల ఏఆర్‌సీఐ నిర్లక్ష్యం

  • ఏఆర్‌సీఐ భూ నిర్వాసితుల ధర్నా

  • న్యాయం చేయకుంటే నిరవధిక దీక్షలు చేపడతామన్న నిర్వాసితులు

సరూర్‌నగర్‌, మార్చి 5 (ఆంధ్ర జ్యోతి): భారత వాయుసేనకు అవసరమైన ఎవియోనిక్స్‌, క్షిపణుల నేవిగేషన్‌ వ్యవస్థల అభివృద్ధి కోసం ఏర్పాటైంది అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఏఆర్‌సీఐ). ఇది రంగారెడ్డి జిల్లా పూర్వ సరూర్‌ నగర్‌ మండలం బాలాపూర్‌ గ్రామంలో కొలువు దీరింది. బాలాపూర్‌ గ్రామంలో గల 74వ సర్వే నంబర్‌లోని 95 ఎకరాల భూమిని 95 ఎస్సీ, బీసీ కుటుంబాలు సేద్యం చేస్తూ జీవనం సాగించేవి. అయితే, ఏఆర్‌సీఐ ఏర్పాటు చేయడానికి 95 ఎకరాల భూమిని 1990లో స్వాధీనం చేసుకున్న నాటి సర్కారు.. భూ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని 1991 మార్చి 23న 207 నంబర్‌ జీవో జారీ చేసింది. ఏఆర్‌సీఐ ఏర్పాటై 36 ఏళ్లవుతున్నా భూ నిర్వాసితులకు న్యాయం జరుగలేదు. కానీ, 40 కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు కల్పించిన ఏఆర్‌సీఐ.. వారిలో 10 మందికే శాశ్వత కొలువులిచ్చింది. మిగతా 30 మంది ఆర్‌సీఐలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. మరో 55 కుటుంబాల సంగతిని పట్టించుకోవడం లేదని.. 36 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితమైందని బాలాపూర్‌ భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఆర్‌సీఐ ఏర్పాటు చేయడానికి జీవనాధారమైన భూమిని కోల్పోయిన తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో గురువారం ఏఆర్‌సీఐ ప్రధాన గేట్‌ వద్ద ధర్నా చేశారు. ఏఆర్‌సీఐ యాజమాన్యంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని, తమకు 207 జీవో ప్రకారం ఉద్యోగాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన కారులతో చర్చలు జరిపిన ఏఆర్‌సీఐ అసిస్టెంట్‌ డైరెక్టర్‌.. తమకు 15 రోజులు గడువిస్తే అధ్యయనం చేసి తగు నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ధర్నా విరమించిన ఆందోళనకారులు గడువు ముగిసిన తర్వాత సరైన న్యాయం జరగక పోతే నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 12:56 AM