ఫోర్జరీ సంతకాలతో రూ.33 లక్షలు డ్రా!
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:43 AM
గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నతాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
గిరిజన సంక్షేమ శాఖ అధికారి సంతకం ఫోర్జరీ చేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి
ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకిఆ మొత్తం
వెళ్లడంతో వెలుగులోకి వచ్చిన స్కాం
రంగారెడ్డి అర్బన్, ఆదిభట్ల, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నతాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసిన వర్త్య శ్రీధర్‌బాబు(38) జూన్ 1వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్నతాధికారుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబసభ్యులు ఆదిభట్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై విచారణ జరుగుతోంది. ఈ విచారణలో గిరిజన సంక్షేమ శాఖలో స్కాం జరిగినట్లుగా వెలుగులోకి వచ్చింది. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన బ్యాంకు ఖాతా శంషాబాద్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉంది. ఈ బ్యాంకు ఖాతా కొన్నేళ్లుగా లావాదేవీలు లేకుండా ఉంది. దీంతో ఆర్‌బీఐ నిబంధనల మేరకు ఆ ఖాతాను యాక్టివేట్ చేయాలని బ్యాంకు అధికారులు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి(డీటీడబ్ల్యూవో)కి సూచించారు. ఆమేరకు సంబంధిత బ్యాంకు మేనేజర్ 2025 నవంబరులో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరి దేవి సంతకం తీసుకుని ఆ ఖాతాను యాక్టివేట్ చేశారు. బ్యాంకు నుంచి కార్యాలయానికి వచ్చిన ఆ చెక్‌బుక్‌ను డీటీడబ్ల్యువోకు ఇవ్వకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వద్దనే పెట్టుకున్నారు.
గిరిజన సంక్షేమ శాఖ నిధులు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.33 లక్షలు ఉండగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వర్త్య శ్రీధర్‌బాబు ఆ మొత్తానికి చెక్కులను ప్రైవేటు వ్యక్తులకు జారీ చేశారు. ఆదిలాబాద్, భువనగిరి, ఫీర్జాదీగూడ, శంషాబాద్‌లలో గల బ్రాంచీల్లో ప్రైవేట్ వ్యక్తులతో రూ.33 లక్షలు డ్రా చేశారు. ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు బదిలీ కావడంతో శంషాబాద్ బ్యాంక్ మేనేజర్ రాకేష్ కుమార్ మేలో కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. విచారణ జరుగుతోన్న సమయంలో... ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా చేసిన శ్రీధర్‌బాబు విషయం వెలుగులోకి వస్తుందని జూన్ 1వ తేదీన తుర్కయంజాల్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా శ్రీధర్‌బాబు చనిపోయిన అనంతరం డీటీడబ్ల్యువో రామేశ్వరిదేవి అతడు ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా చేసినట్లు... అలాగే తన సంతకం వెరిఫై చేయకుండానే డబ్బులు విడుదల చేశారనిశంషాబాద్ బ్యాంక్ మేనేజర్‌పై ఈ నెల 9వ తేదీన ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు.