వారంతా మళ్లీ అక్కడే?
ABN , Publish Date - Jun 06 , 2026 | 04:07 AM
కొందరు వైద్యు లు, ఇతర సిబ్బంది.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, పట్టణ ప్రాంతాల్లోని పోస్టుల్లో పనిచేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ వేశారు.
వైద్యశాఖలో యూనియన్ నేతల పేరిట బదిలీ మినహాయింపు కోసం 326 మంది విజ్ఞప్తి
అందులో చాలా మందికి రిటెన్షన్?
యూనియన్ల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం!
తమకు అన్యాయం జరుగుతోందంటూ గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యుల ఆందోళన
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): కొందరు వైద్యు లు, ఇతర సిబ్బంది.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, పట్టణ ప్రాంతాల్లోని పోస్టుల్లో పనిచేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ వేశారు. వివిధ యూనియన్లలో కీలక బాధ్యతల్లో ఉన్నట్టు లేఖలు తెచ్చుకుని.. బదిలీల నుంచి మినహాయింపు కోరారు.. ఈ క్రమంలో చాలా మందికి బదిలీల నుంచి మినహాయింపు వచ్చినట్టు అధికార వర్గాల సమాచారం. వైద్య ఆరోగ్యశాఖలో డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ తదితర విభాగాల పరిధిలోని వైద్యులు, ఇతర పారామెడికల్ సిబ్బంది సుమారు 326 మంది తమను బదిలీల నుంచి మినహాయించాలంటూ యూనియన్ల పేరిట లేఖలు అందజేసినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నుంచి 186 మంది, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ నుంచి వందమంది, టీఎన్‌జీవోల నుంచి మరో 40 మంది ఈ జాబితాలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
గ్రామీణ వైద్యులు, సిబ్బంది ఆందోళన
బదిలీల ప్రక్రియ సమయంలో ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌కు వేయికిపైగా ఫిర్యాదులు వచ్చాయి. అందులో చాలా వరకు హైదరాబాద్‌లో ఏళ్లతరబడి పాతుకుపోయిన వారిని, సంఘాల పేరుతో రీటెన్షన్ అయ్యేవారిని బదిలీ చేయాలని గ్రామీణ ప్రాంత వైద్యులు చేసిన విజ్ఞప్తులే ఉండటం గమనార్హం. కొందరు వైద్యులు రెండు, మూడు దశాబ్దాలుగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యులు, వైద్య కళాశాలల్లోని అధ్యాపకులు బదిలీలు జరిగిన ప్రతిసారీ హైదరాబాద్‌లో పోస్టింగ్‌లపై ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడివారు కదలకుండా మినహాయింపు పొందుతుండటంతో నిరాశలో మునిగిపోతున్నారు. ఇప్పుడు కూడా వైద్య సేవలు నిలిపేస్తామనే బెదిరింపులకు, సంఘాల నేతలు తెచ్చిన ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందని ఆరోపిస్తున్నారు.
నేడు బదిలీలపై సమాచారం
ప్రభుత్వం చేపట్టిన బదిలీల ప్రక్రియ శనివారంతో ముగియనుంది. వైద్యారోగ్య శాఖ పరిధిలో బదిలీ అయిన 5,800 మందికి మెసేజీలు అందనున్నాయి. అందులో వారు ఎక్కడికి బదిలీ అయ్యారనే వివరాలు తెలుస్తాయి. అధికారులు, ఉద్యోగులంతా మెసేజీలో ఇచ్చిన లింకు ఆధారంగా ఆన్‌లైన్‌లో లాగినై.. బదిలీ ఉత్తర్వులను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆ కాపీని తీసుకుని బదిలీ అయిన చోటికి వెళ్లి విధుల్లో చేరాల్సి ఉంటుంది. కాగా, బంద్‌కు ఇచ్చిన పిలుపును వెనక్కి తీసుకుంటున్నామని, వైద్య సేవలు యధావిధిగా కొనసాగుతాయని వైద్యుల సంఘాలు శుక్రవారం ప్రకటించాయి.