Share News

కృష్ణాతీరంలో 3వేల ఏళ్లనాటి మహానగరం

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:29 AM

నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలోని వీర్లపాలెం- వీరప్పగూడెం సరిహద్దుల్లో 3వేల ఏళ్లనాటి చారిత్రక నగరం ఆనవాళ్లు బయటపడ్డాయి.

కృష్ణాతీరంలో 3వేల ఏళ్లనాటి మహానగరం

  • నల్గొండ జిల్లాలో వెలుగుచూసిన బృహత్‌ శిలాయుగం నాటి ఆనవాళ్లు..

  • చారిత్రక నగరిని గుర్తించిన ద్యావనపల్లి సత్యనారాయణ

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలోని వీర్లపాలెం- వీరప్పగూడెం సరిహద్దుల్లో 3వేల ఏళ్లనాటి చారిత్రక నగరం ఆనవాళ్లు బయటపడ్డాయి. క్రీ.పూ 1000 ఏళ్లకు ముందు నుంచి క్రీ.శ 15వ శతాబ్దం వరకు విరాజిల్లిన ఈ మహానగరం ఆనవాళ్లను ప్రముఖ చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ గుర్తించారు. ఆ ప్రాంతం సమీపంలోని ఇరుకుగూడెం వాసుల ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన ఆయన.. కృష్ణా తీరంలో పురాతన నగర శిథిలాలను కొనుగొన్నారు. అక్కడ వందలాదిగా కనిపించే బృహత్‌శిలా యుగంనాటి సమాధులు, ఆనాటి ఇనుప యుగపు సంస్కృతికి అద్దం పడుతున్నాయి. చనిపోయిన కులపెద్దల జ్ఞాపకార్థం వారు వాడిన వస్తువులు, ఆభరణాలను ఉంచి భారీ శిలలతో సమాధులను నిర్మించే ఆచారం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీరుల సమాధుల వల్లే ఆ ప్రాంతాలకు వీర్లపాలెం, వీరప్పగూడెం పేర్లు వచ్చాయని ద్యావనపల్లి సత్యనారాయణ వివరించారు. కందూరి చోళుల కాలం నుంచి రేచర్ల పద్మనాయకుల కాలం వరకు ఇక్కడ కోటగోడలు, బురుజులు, దేవాలయాలు, బావులు, ఇళ్లు, శిల్పాలు కనిపిస్తున్నాయని ద్యావనపల్లి చెబుతున్నారు. ముఖ్యంగా కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం ఒక ప్రముఖ వ్యాపార కేంద్రంగా, ధాన్యపు గిడ్డంగిగా సేవలందించింది. శత్రువుల నుంచి రక్షణ పొందేలా నిర్మించిన కోటగోడలు, ఆగ్నేయ దిశలోని ఎత్తైన బురుజులు ఇక్కడ ఉన్నాయి. అలాగే కోటకు కొంత దూరంలో లక్ష్మీనరసింహాలయాన్ని గుర్తించారు. అయితే, ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రదేశం ప్రస్తుతం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. గుప్తనిధుల వేటలో దుండగులు జరుపుతున్న అక్రమ తవ్వకాల వల్ల చారిత్రక రాళ్లు ధ్వంసమవుతున్నాయి. దీనికి తోడు నిర్మాణాల కోసం, సమీపంలోని సిమెంటు ఫ్యాక్టరీ అవసరాల కోసం ఈ పురాతన శిలలను వినియోగించడంతో అనేక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికైనా పురావస్తు శాఖ స్పందించి ఈ చారిత్రక మహానగరాన్ని పరిరక్షించాలని ద్యావనపల్లి సత్యనారాయణ కోరుతున్నారు.

Updated Date - Feb 11 , 2026 | 02:29 AM