లైఫ్ సైన్సెస్ రంగంలో 300 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Mar 16 , 2026 | 03:56 AM
అమెరికాకు చెందిన కేంబ్రిడ్జ్ ఐసోటోప్ లేబొరేటరీస్, స్థానిక కెమ్‌తత్వ చిరల్ సొల్యూషన్స్ సంయుక్తంగా లైఫ్ సైన్సెస్ రంగంలో అధునాతన తయారీ కేంద్రాన్ని...
ఈ ప్రాజెక్టుతో 250 మందికి ఉద్యోగాలు: శ్రీధర్ బాబు
హైదరాబాద్, మార్చి 15 (ఆంద్రజ్యోతి): అమెరికాకు చెందిన కేంబ్రిడ్జ్ ఐసోటోప్ లేబొరేటరీస్, స్థానిక కెమ్‌తత్వ చిరల్ సొల్యూషన్స్ సంయుక్తంగా లైఫ్ సైన్సెస్ రంగంలో అధునాతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఈ కంపెనీలు వచ్చే మూడేళ్లలో రూ.300 కోట్ల పెట్టుబడి పెడతాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ ఫేజ్--4లో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఆదివారం సచివాలయంలో తనతో సమావేశమైన రెండు కంపెనీల సీఈవోలు పెట్టుబడులకు అంగీకరించారని చెప్పారు. ‘‘కేంబ్రిడ్జ్ ఐసోటోప్ లేబొరేటరీస్, కెమ్‌తత్వల భాగస్వామ్యం అంతర్జాతీయ కంపెనీలకు రాష్ట్రంపై ఉన్న ప్రగాఢ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ పెట్టుబడి ద్వారా అధునాతన కెమిస్ట్రీ, మెటీరియల్స్ రంగాల్లో రాష్ట్ర సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఈ అత్యాధునిక తయారీ కేంద్రంలో ఐసోటోప్ లేబుల్డ్ కాంపౌండ్స్ ఉత్పత్తి అవుతాయి. ప్రాజెక్టు పూర్తయితే దేశం వీటి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోగలుగుతుంది’’ అని శ్రీధర్ బాబు వివరించారు.