మెట్రో ఏసీ, డీలక్స్ బస్సు చార్జీల్లో 30 శాతం రాయితీ
ABN , Publish Date - Mar 26 , 2026 | 05:22 AM
పెట్రోలు, డీజిల్ కొరత వార్తలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న నేపథ్యంలో.. నగర వాహనదారులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. గ్రేటర్ పరిధిలో..
ఇంధన కొరతనేపథ్యంలో ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త
హైదరాబాద్ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): పెట్రోలు, డీజిల్ కొరత వార్తలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న నేపథ్యంలో.. నగర వాహనదారులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. గ్రేటర్ పరిధిలో.. మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు బుధవారం సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘పెట్రోల్ కష్టాలు పడటం ఎందుకు దండగ... ఆర్టీసీ బస్సులు ఉండగా’ అంటూ పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ప్రయోజనాలను వివరించారు. ప్రస్తుత సంక్షోభ తరుణంలో వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాను ఆశ్రయించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందన్నారు. రోడ్లపై రద్దీ తగ్గడంతో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం తగ్గుముఖం పట్టి పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. బంకుల వద్ద బారులు తీరొద్దని.. ఎలక్ట్రిక్ బస్సుల్లో క్షేమంగా ప్రయాణించాలని నగరవాసులకు ఆర్టీసీ ఎండీ విజ్ఞప్తి చేశారు.