Share News

మాజీ సైనికుల భూమి 250 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల పరం

ABN , Publish Date - Sep 24 , 2026 | 08:33 AM

నగర శివారు కొల్లూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 191, 297లలో మాజీ సైనికులకు కేటాయించిన భూములను.. కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రైవేటు వ్యక్తులు, కొన్ని రియల్‌ ఏస్టేట్‌ సంస్థల పేర్ల మీద నమోదు చేశారని, దీనిని రద్దు చేసి ఆ భూమిని మాజీ సైనికులకు తిరిగి అప్పగించాలని బుధవారం ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాసింది

 మాజీ సైనికుల భూమి 250 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల పరం

  • తిరిగి వారికే అప్పగించాలని గవర్నర్‌కు ఎఫ్‌జీజీ లేఖ

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నగర శివారు కొల్లూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 191, 297లలో మాజీ సైనికులకు కేటాయించిన భూములను.. కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రైవేటు వ్యక్తులు, కొన్ని రియల్‌ ఏస్టేట్‌ సంస్థల పేర్ల మీద నమోదు చేశారని, దీనిని రద్దు చేసి ఆ భూమిని మాజీ సైనికులకు తిరిగి అప్పగించాలని బుధవారం ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాసింది. ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి దీనిని మీడియాకు విడుదల చేశారు. 83 మంది మాజీ సైనికులకు ఒక్కొక్కరికి మూడెకరాల చొప్పున కేటాయించారని, ఇది అమలు చేయడానికి తహశీల్దార్‌ సప్లిమెంటరీ సేత్వార్‌ను జారీ చేశారని తెలిపారు. కానీ కొలతలు వేసి హద్దు నిర్ణయించి మాజీ సైనికులకు అప్పగించలేదని... దానిని అన్యాక్రాంతం చేశారని అన్నారు. అప్పటి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌కె సిన్హా ఆధ్వర్యంలో విచారణ చేసి తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని అన్నారు. ఏడుగురు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై నకిలీ పత్రాల ఆధారంగా సర్వే నంబర్‌ 191లో సుమారు 250 ఎకరాలను కొంతమంది వ్యక్తులు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు కేటాయించిన్నట్లు గుర్తించారని, నకిలీ పత్రాల ఆధారంగా వారు పట్టా పొందారని నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. ఈ 250 ఎకరాల్లో దాదాపు 50ఎకరాలు అక్రమణలో ఉందని, పెద్ద కాలనీ ఏర్పడిందని, సుమారు 200 ఎకరాలు ఇంకా ఖాళీగా ఉందని తెలిపారు. రికార్డులో మాత్రం సంస్థలు, వ్యక్తుల పేర్లపై యాజమాన్యపు హక్కులు ఉన్నాయన్నారు. వాటిని రద్దు చేసి మాజీ సైనికులకు కేటాయించాలని కోరారు.

Updated Date - Sep 24 , 2026 | 08:33 AM