పానీపూరి తిని 24 మందికి అస్వస్థత
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:37 AM
పానీపూరి తిని 18 మంది చిన్నారులు సహా మొత్తం 24 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని కేసీఆర్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది.
బాధితుల్లో 18 మంది చిన్నారులు.. సిరిసిల్ల జిల్లాలో ఘటన
సిరిసిల్ల, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): పానీపూరి తిని 18 మంది చిన్నారులు సహా మొత్తం 24 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని కేసీఆర్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. మంగళవారం తోపుడు బండిపై వచ్చిన పానీపూరిని పలువురు కాలనీవాసులు తిన్నారు. వారిలో 18 మంది చిన్నారులు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని కుటుంబసభ్యులు అర్ధరాత్రి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం కూడా మరికొందరు అస్వస్థతకు గురవ్వడంతో పానీపూరి బాధితుల సంఖ్య పెద్దవారితో కలుపుకుని 24 మందికి చేరుకుంది. జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం 12 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దవాళ్లు చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఓ చిన్నారికి ఫిట్స్ రావడంతో వైద్యులు సకాలంలో స్పందించి చికిత్స అందించారు.