Share News

అనుమతులుంటే 22ఏలో ఉన్నా రిజిస్ట్రేషన్‌

ABN , Publish Date - Sep 25 , 2026 | 04:58 AM

సెక్షన్‌-22ఏలో ఉన్న ఆస్తులు/భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 22ఏ ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ.. సంబంధిత ప్రభుత్వ సంస్థల నుంచి చట్టబద్ధమైన అనుమతులు పొంది అభివృద్ధి చేసిన ఓపెన్‌ ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్లకు నిర్దేశిత నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించింది

అనుమతులుంటే 22ఏలో ఉన్నా రిజిస్ట్రేషన్‌
pongulatisrinivasreddy

  • జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతుల పత్రాలిస్తే చాలు

  • సర్కారు కీలక నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా 264 కాలనీలకు స్వేచ్ఛ

  • సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం: పొంగులేటి

  • 2 లక్షల ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లకు లైన్‌ క్లియర్‌

  • ఉత్తర్వుల అమలుకు జిల్లా స్థాయి కమిటీ

  • ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం: పొంగులేటి

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సెక్షన్‌-22ఏలో ఉన్న ఆస్తులు/భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 22ఏ ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ.. సంబంధిత ప్రభుత్వ సంస్థల నుంచి చట్టబద్ధమైన అనుమతులు పొంది అభివృద్ధి చేసిన ఓపెన్‌ ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్లకు నిర్దేశిత నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌ గురువారం రాత్రి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌-1908లోని సెక్షన్‌-22ఏ ప్రకారం నిషేధిత జాబితా (ప్రొహిబిషన్‌ ఆర్డర్‌ బుక్‌)లో ఉన్నప్పటికీ భూములు, ఆస్తుల క్రయవిక్రయాలకు ప్రతిబంధకాలు ఉండబోవని తెలిపారు. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్‌ మెట్రోపాలిటల్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ), డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) అనుమతులు ఉన్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు తొలగినట్లయింది. నిషేధిత జాబితాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే జీవో నెం.118, జీవో నెం.76లను జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు మరింత ఉపశమనం కలగనుంది. రంగారెడ్డి జిల్లాలో 44 కాలనీలు, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో 65 కాలనీలు కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా 264 కాలనీల్లో ఆస్తులు/భూముల విక్రయాలకు స్వేచ్ఛ లభించినట్లయింది. అయితే ఏదైనా న్యాయస్థానం తీర్పులు ప్రతికూలంగా ఉంటే ఆ ఆస్తులు/భూములను రిజిస్ట్రేషన్‌ చేయరు. తుది తీర్పులకు లోబడే క్రయవిక్రయాలు ఉంటాయి. క్రయవిక్రయాలు చేసుకునే వారు విధిగా చెల్లుబాటయ్యే పత్రాలను చూపించాల్సి ఉంటుంది. లింక్‌ డాక్యుమెంట్లు సమర్పిస్తే రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇస్తారు. ఈ ప్రక్రియలో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు వీలుగా జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు), జిల్లా రిజిస్ర్టార్‌, హెచ్‌ఎండీఏ/పురపాలక సంస్థ/గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధి సభ్యులుగా ఉన్నారు.


ఒక్కొక్కటిగా పరిష్కారం: పొంగులేటి

దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న 22ఏ సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 16న శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు సహచర మంత్రులతో చర్చించి 22ఏ సమస్యలను ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇప్పటికే అమలులోకి వచ్చిన నిర్ణయాలే నిదర్శనమని అన్నారు. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో 64 కాలనీల ఇళ్ల క్రమబద్థీకరణ సమస్యకు జీవో 118కు అనుగుణంగా మెమో జారీ చేశామని తెలిపారు. దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సింగరేణి కార్మికుల ఇళ్ల క్రమబద్ధీకరణ సమస్యను కూడా జీవో 76 ద్వారా పరిష్కరించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. భూమి, ఇల్లు వంటి అంశాల్లో ప్రజలు ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితికి ముగింపు పలకడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు. 22-ఏలోని అన్ని భూములను ఒకే గాటన కట్టకుండా.. భూమి స్వభావం, అందుబాటులో ఉన్న రికార్డులు, చట్టబద్ధమైన అనుమతులు, న్యాయపరమైన అంశాలను పరిశీలించి అర్హమైన సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎల్‌నినోపై ‘ఉపాధి’ అస్త్రం

ఊపందుకున్న ఉపాధి పనులు

Updated Date - Sep 25 , 2026 | 04:58 AM