22ఏపై ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తాం
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:50 AM
22ఏ భూముల విషయంలో ప్రజలకు భరోసా కల్పించేలా రెవెన్యూ శాఖ చర్యలు ఉంటాయని, అర్హత ఉన్న ప్రతి ఫిర్యాదును పరిష్కరించి, దరఖాస్తుదారుకు న్యాయం జరిగేలా చూస్తామని..
ప్రజలకు భరోసా కల్పించేలా ‘రెవెన్యూ’ చర్యలు.. నేటి నుంచి జిల్లాల వారీగా రెవెన్యూ సమీక్షలు
అక్రమాస్తుల క్రమబద్ధీకరణకే విపక్షాల ఆరోపణలు
ఏడాదిన్నరలో రాష్ట్రం మొత్తం భూ సర్వే పూర్తి: పొంగులేటి
హైదరాబాద్, సత్తుపల్లి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): 22ఏ భూముల విషయంలో ప్రజలకు భరోసా కల్పించేలా రెవెన్యూ శాఖ చర్యలు ఉంటాయని, అర్హత ఉన్న ప్రతి ఫిర్యాదును పరిష్కరించి, దరఖాస్తుదారుకు న్యాయం జరిగేలా చూస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నిషేధిత భూముల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 22ఏపై ఫిర్యాదులు, వాటి పరిష్కారంపై టెలికాన్ఫరెన్స్ ద్వారా గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు. అలాగే, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలో భూ రీ సర్వేపై అవగాహన సదస్సులోనూ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్ అర్బన్ పరిధిలో ఉన్న నాలుగు జిల్లాల్లో 22ఏ అంశంపై ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 400 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వివరించారు. కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించే దిశగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుదారు పూర్తి వివరాలను ఆర్డీవో, తహశీల్దార్, సబ్ రిజిస్ర్టార్లకు పంపాలని సూచించారు. అలాగే, సమస్య పరిష్కారమయ్యే వరకు పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు.
కాల్ సెంటర్ నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు స్వీకరించిన అధికారులు తక్షణమే స్పందించాలని, ఒకసారి ఫిర్యాదు చేశాక.. మళ్లీ మళ్లీ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చూడాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించేలా శుక్రవారం నుంచి జిల్లాల వారీగా రెవెన్యూ సమీక్షలు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపైనా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వేలాది ఎకరాల అక్రమాస్తులను బీఆర్‌ఎస్ నాయకులు కొల్లగొట్టారని, 22ఏను భూతంగా చూపి ఆయా ఆస్తులను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు కుట్ర చేస్తున్నారని, ఈ క్రమంలోనే నిషేధిత జాబితాలో చేర్చారంటూ అమాయకులను ముందుపెట్టి ఆ పార్టీ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. వారు చేసిన అక్రమాలను తమ ప్రభుత్వంపై రుద్దాలని చూస్తున్నారని, వారి బెదిరింపులు, ఆరోపణలకు తాను గానీ, ప్రభుత్వం గానీ భయపడేది లేదని స్పష్టం చేశారు. భూ భారతి చట్టం వచ్చే ఎన్నికలకు రెఫరెండమన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 25 రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే పూర్తి కావొచ్చిందన్నారు. ఏడాదిన్నరలో రాష్ట్రంలోని భూముల రీ సర్వే పూర్తి చేస్తామని ప్రకటించారు.