పాతికేళ్లకే సివిల్ జడ్జి ఉద్యోగం
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:05 AM
చిన్నతనంలోనే తండ్రి మరణించాడు.. చిన్న స్థాయిలో సిమెంట్ వ్యాపారం చేసే తల్లే ఆలనాపాలనా చూసింది..అన్నయ్య అండగా నిలిచాడు..
పరీక్షల్లో విజయం సాధించిన పేదింటి యువతి
బోయినపల్లి, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): చిన్నతనంలోనే తండ్రి మరణించాడు.. చిన్న స్థాయిలో సిమెంట్ వ్యాపారం చేసే తల్లే ఆలనాపాలనా చూసింది..అన్నయ్య అండగా నిలిచాడు..కన్నవారి కలలను నిజం చేస్తూ పాతికేళ్లకే ఓ యువతి జూనియర్ సివిల్ జడ్జి ఉద్యోగానికి ఎంపికయింది. బోయినపల్లి బాపూజీనగర్‌కు చెందిన సింగిరెడ్డి పరాధితా రెడ్డి కుమార్తె శ్రావణి...జీవిత లక్ష్యాల సాధనకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. ఆమె బాపూజీ నగర్‌లోని సాయి మోడల్ స్కూల్‌లో విద్యను అభ్యసించింది. ఇంటర్‌లో సీఈసీ, అనంతరం అయిదు సంవత్సరాల ఎల్.ఎల్.బీ., ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసింది. సివిల్ జడ్జిల పోస్టుల భర్తీ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో నిర్వహించిన పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణురాలైంది. తల్లితో పాటు, అన్నయ్య భానుప్రకాశ్ రెడ్డిల ప్రోత్సాహంతో విజయం సాధించినట్టు ఆమె చెప్పారు.