సర్ మ్యాపింగ్‌లో ఓటు భద్రమే!
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:59 AM
సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా.. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)తో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ఎన్నికల కమిషన్ నిబంధనలను జాగ్రత్తగా పాటించాలి
2002 నాటి ఓటరు జాబితా ఆధారంగా మ్యాపింగ్
వివాహిత మహిళలు, యువతకు ప్రత్యేక పద్ధతులు
బీఎల్‌వోల సహకారంతో సులువుగా పరిష్కారం
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా.. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)తో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ నెల 25 నుంచి చేపట్టనున్న ఈ కార్యక్రమంలో భాగంగా.. రెండు చోట్ల నమోదైన పేర్లను, మరణించినవారి పేర్లను తొలగించడం, చిరునామా మార్పులపై సవరణలు చేయడం వంటి ప్రక్రియలు నిర్వహిస్తారు. దీంతోపాటు అనర్హుల పేర్లను తొలగించి, అర్హులను జాబితాలో చేరుస్తారు. ఈ కార్యక్రమంపై ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. అయితే ఈ ప్రక్రియ అంతా 2002 నాటి ఓటరు జాబితా ఆధారంగా సాగుతుండటంతో.. ఆనాటి ఓటరు జాబితాలో లేనివారిని తాజా సవరణ జాబితాలో ఉంచుతారా? తొలగిస్తారా? అన్న అయోమయం ప్రజల్లో నెలకొంది. ఓటర్ మ్యాపింగ్‌లో తమ ఓటుహక్కు ఎక్కడ గల్లంతవుతుందోనని అనేక మంది ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా 2002 తర్వాత వివాహమై అత్తగారిళ్లకు వచ్చిన మహిళలు, 2002 తర్వాతే ఓటుహక్కు సాధించిన యువతకు ఈ ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడంతో తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న పలు సందేహాలు, వాటికి ఎన్నికల సంఘం సూచిస్తున్న పరిష్కారాలు ఇవీ..
ప్రస్తుతం ఉన్నచోట 2002 నాటి ఓటరు జాబితాలో పేరు లేకుంటే ఏం చేయాలి..?
సర్ మ్యాపింగ్‌లో ఉన్న మూడు రకాల పద్ధతులను వివాహిత మహిళలు అనుసరించాలి. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో బీఎల్‌వోల వద్ద అందుబాటులో ఉన్న యాప్‌లో మూడు రకాల ఆప్షన్లు ఉంటాయి. మీ ప్రస్తుత ఓటు స్థితిని బట్టి సరైన ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఏయే పద్ధతుల్లో మ్యాపింగ్ చేసుకోవచ్చు?
2002 ఓటరు జాబితాలో పేరు ఉండి, ప్రస్తుత జాబితాలో కూడా పేరు ఉన్నవారు బీఎల్‌వోల సహకారంతో సెల్ఫ్ మ్యాపింగ్ విధానం పాటించవచ్చు. 2002లో మైనర్ కావడం వల్ల ఓటరు జాబితాలో పేరు లేకుండా.. ప్రస్తుతం ఓటు హక్కు కలిగి ఉన్న యువతకు యాడ్ ప్రొజెనీ విధానం వర్తిస్తుంది. దీని ప్రకారం.. ఓటరుకు చెందిన తాత, అమ్మమ్మ, నానమ్మ, నాన్న, అమ్మ వీరిలో ఎవరిదైనా ఒకరి పేరు 2002 జాబితాలో ఉంటే.. ఆ వివరాల ఆధారంగా వారు యాడ్ ప్రొజెనీ విధానంలో బీఎల్‌వోల ద్వారా మ్యాపింగ్ చేయించుకోవచ్చు.
2002లో ఓటు నమోదు చేసుకోని వారి పరిస్థితి ఏంటి?
2002 నాటికే 18 ఏళ్లు నిండినప్పటికీ.. ఏదైనా కారణం వల్ల అప్పట్లో ఓటర్ జాబితాలో పేరు నమోదు కానివారు సెల్ఫ్ ప్రొజెనీ విధానాన్ని ఎంచుకోవచ్చు. సదరు ఓటరుకు చెందిన కుటుంబ పెద్దల (తల్లిదండ్రులు/తాత ముత్తాతలు) పేరు 2002 జాబితాలో ఉంటే, ఆ లింక్ ఆధారంగా బీఎల్‌వో ద్వారా సెల్ఫ్ ప్రొజెనీ పద్ధతిలో మ్యాపింగ్ పూర్తి చేయించు కోవచ్చు.
వివాహిత మహిళలు ఓటు హక్కు కోల్పోవద్దంటే ఏం చేయాలి..?
2002 తర్వాత పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చిన మహిళలకు సమస్య ఎదురవుతుంది. వారు ప్రస్తుతం ఉంటున్నచోట 2002 జాబితాలో వారి పేర్లు ఉండవు. అలాంటివారు తమ ఓటుహక్కు కోల్పోకుండా ఉండాలంటే నాలుగు సూత్రాలు పాటించాలని ఎన్నికల సంఘం విధి విధానాల్లో సూచిస్తోంది.
ఈసీఐ విధానాల ప్రకారం వివాహిత మహిళలు ఏం చేయాలి..?
వివాహిత మహిళలు వారు పుట్టిన ఊరిలో 2002 ఓటరు జాబితాను పరిశీలించాలి. అక్కడ వారి అమ్మ, నాన్న పేరు ఏ సీరియల్ నంబర్‌లో ఉందో తెలుసుకుని, ఆ పేజీని స్ర్కీన్ షాట్, జిరాక్స్ తీసుకోవాలి. ఆ సీరియల్ నంబర్ వివరాలను, ప్రస్తుత ఓటర్ ఐడీ కార్డును తీసుకుని ఇప్పుడు ఉంటున్న ఊరి బీఎల్ వోకు సమర్పించాలి.
బీఎల్‌వోలు ఎలా మ్యాపింగ్ చేస్తారు..?
మహిళలు తాము పుట్టిన ఊరిలో సేకరించిన 2002 జాబితాలోని ఓటరు కార్డు నంబర్ ఆధారంగానే బీఎల్‌వోలు వివాహిత మహిళలను ప్రస్తుత ఓటరు జాబితాలో మ్యాపింగ్ చేసి.. ఓటును భద్రపరుస్తారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రతి గ్రామం/వార్డుకు సంబంధించిన 2002 నాటి ఓటరు జాబితాను స్థానిక బీఎల్‌వోలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లకు అందజేశారు. వివాహిత మహిళలు తాము పుట్టిన ఊరు, ప్రస్తుతం నివాసం ఉన్న ఊరి బీఎల్‌వోను సంప్రదిేస్త ఈ జాబితా లభిస్తుంది.
నియోజకవర్గం మారితే ఓటరును ఎలా గుర్తిస్తారు..?
నియోజకవర్గం మారిన వారిని గుర్తించేందుకు ఎన్నికల సంఘం ఎక్కడా ఓటరును ఇబ్బంది పెట్టకుండా ఒక కేంద్రీకృత డిజిటల్ డేటాబేస్‌ను వాడుతోంది. ఓటరు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గంలో ఫారమ్‌ను నింపినప్పుడు, సాఫ్ట్‌వేర్ కేవలం ఆ ఒక్క నియోజకవర్గంలోనే వెతకదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2002 నాటి పూర్తి డేటాబేస్‌లో వారి పేరు, తండ్రి/భర్త పేరును రన్ చేస్తుంది. ఉదాహరణకు 2002 నాటి రికార్డుల్లో ఓ వ్యక్తి పేరు వరంగల్‌లో ఉన్నట్లు సాఫ్ట్‌వేర్ గుర్తిస్తే. అది వెంటనే ఆ పాత రికార్డును ఇక్కడి కొత్త రికార్డుతో ‘‘లింక్’’ (క్రాస్ కానిస్టిటెన్సీ) చేస్తుంది. దీనివల్ల పాత ఓటు రికార్డు ఇక్కడికి అనుసంధానించబడుతుంది. పాత చోట ఆ ఓటు ఇకపై పూర్తిగా నిలిచిపోతుంది.