Share News

రిటైర్డు ఉద్యోగుల జీపీఎఫ్‌, కమ్యూటేషన్ల కోసం..రూ.2000 కోట్లు

ABN , Publish Date - May 30 , 2026 | 04:22 AM

రిటైర్డు ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వారి బకాయిలను తీర్చే అంశంలో తొలి అడుగు వేసింది.

రిటైర్డు ఉద్యోగుల జీపీఎఫ్‌, కమ్యూటేషన్ల కోసం..రూ.2000 కోట్లు

  • 100 రోజుల్లో 6 వేల కోట్ల బకాయిలు క్లియర్‌ చేస్తామన్న ప్రభుత్వం

  • హామీ ప్రకారం తొలి విడతగా రూ.రెండు వేల కోట్లు మంజూరు

  • డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో నిధులు విడుదల చేసిన ఆర్థిక శాఖ

  • నిర్ణీత గడువులోగా మిగిలిన సొమ్ము విడుదలకు వేగంగా కసరత్తు

  • బీఆర్‌ఎస్‌ హయాం నుంచి బిల్లుల పెండింగ్‌

  • రిటైరైన రోజే విరమణ ప్రయోజనాలు ఇవ్వాలని నాడు కేసీఆర్‌ మాట

  • ఆ మాట చెల్లుబాటు కాక పేరుకుపోయిన బకాయిలు

  • ప్రస్తుత ప్రభుత్వం చొరవపై పింఛనుదారుల హర్షం

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): రిటైర్డు ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వారి బకాయిలను తీర్చే అంశంలో తొలి అడుగు వేసింది. పెన్షనర్లకు సంబంధించిన రూ.6000 కోట్లు బకాయిలను 100 రోజుల్లోగా క్లియర్‌ చేస్తామని మాటిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రిటైర్డు ఉద్యోగుల జీపీఎఫ్(జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌), కమ్యూటేషన్ల బకాయిలను చెల్లించేందుకు శుక్రవారం రూ.2000 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం సాహసోపేతమైన నిర్ణయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, రిటైర్డు ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. నిజానికి, రిటైర్డు ఉద్యోగుల పదవీ ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ నేతృత్వంలోని గత ప్రభుత్వం ఆ బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్‌ చేయకపోవడంతో అవి కుప్పలా పేరుకుపోయాయి. సాధారణంగా ఓ ఉద్యోగి రిటైర్‌ అయిన వెంటనే.. ఆ ఉద్యోగికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ ప్రభుత్వం క్లియర్‌ చేయాలి. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు. ఉద్యోగి రిటైర్‌ అయిన రోజే ఆర్థిక ప్రయోజనాల మొత్తాన్ని చెల్లించాలని, ఆ ఉద్యోగిని గౌరవంగా సత్కరించి, ప్రభుత్వ వాహనంలోనే ఇంటి వద్ద దిగబెట్టాలని కూడా కేసీఆర్‌ అప్పట్లో ఆదేశించారు. కేసీఆర్‌ చెప్పిన మాటలు కార్యరూపం దాల్చలేదు. రిటైర్‌ అయిన ఉద్యోగులకు నెలలు, సంవత్సరాల తరబడి ఆర్థిక ప్రయోజనాలను చెల్లించకుండా నిలిపివేశారు. ఒక ఉద్యోగి పదవీ విరమణ పొందగానే జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(జీపీఎఫ్‌), ప్రభుత్వ జీవిత బీమా సొమ్ము, కమ్యూటేషన్‌ సొమ్ము, ఆర్జిత సెలవుల ఎన్‌క్యా్‌షమెంట్‌ సొమ్ము చేతికందాలి. ఇవి పూర్తిగా ఉద్యోగికి సంబంధించిన సొమ్మే. ఉద్యోగి దాచుకున్న సొమ్మును కూడా నాటి ప్రభుత్వం వారికి ఇవ్వలేకపోయింది.


వీటితో పాటు ప్రభుత్వం నుంచి చెల్లించే రూ.16లక్షల గ్రాట్యుటీ ఉంటుంది. ఇలా ఒక ఉద్యోగి రిటైర్‌ కాగానే దాదాపు రూ.80-90 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ సొమ్మును గత ప్రభుత్వం చెల్లించకపోవడంతో రిటైర్డు ఉద్యోగులు చాలా మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వచ్చారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత.. పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేస్తామని రిటైర్డు ఉద్యోగులకు హామీ ఇచ్చింది. కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంత కాలయాపన జరిగింది. ఎట్టకేలకు సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని నిధులను విడుదల చేస్తామని వెల్లడించారు. ఏప్రిల్‌ 23న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఉద్యోగుల బిల్లులను ముఖ్యంగా రిటైర్డ్‌ ఉద్యోగుల బిల్లులను ముందుగా క్లియర్‌ చేస్తామని ప్రకటించారు. ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్‌ పార్ట్‌ ఫైనల్‌, బీమా క్లెయిమ్‌లు, ఇతరత్రా బిల్లులు దాదాపు రూ.6,200 కోట్లు, పెన్షనర్ల బిల్లులు రూ.8000 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు క్యాబినెట్‌ తేల్చింది. అయితే, పెన్షనర్లకు సంబంధించి రూ.6000 కోట్లను 100 రోజుల్లో క్లియర్‌ చేస్తామని క్యాబినెట్‌ ప్రకటించింది. ఆ తర్వాత ఉద్యోగుల జేఏసీ నాయకులతో సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఈ విషయంలో భరోసా ఇచ్చారు. పెన్షనర్ల సొమ్మును ముందుగా విడుదల చేస్తామని చెప్పారు. అన్నట్లుగానే... ప్రభుత్వం రూ.6000 కోట్లలో రూ.2000 కోట్లను శుక్రవారం విడుదల చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రూ.2000 కోట్లను విడుదల చేయాలంటూ ఆదేశించిన మీదట ఆర్థిక శాఖ అధికారులు నిధుల విడుదల చర్యలు తీసుకున్నారు. ఈ నిధుల ద్వారా రిటైర్డు ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్‌ బిల్లులు 100 శాతం క్లియర్‌ అయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. 2025 మే నెల వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్‌ బకాయిలన్నింటినీ పూర్తిగా క్లియర్‌ చేసినట్లయిందని వివరించింది. ‘ముందస్తు ప్రణాళిక, పక్కా కార్యాచరణతోనే ఇది సాధ్యమైంది. ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ.4,000 కోట్ల బకాయిల సొమ్మును కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తోంది’ అని తెలిపింది. నిజానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం కొంత కష్టంగానే ఉంది. ప్రతి నెలా అన్ని రకాల రాబడుల ద్వారా రూ.18 వేల కోట్ల వరకు నిధులు సమకూరుతుంటే... వ్యయం మాత్రం రూ.22వేల కోట్ల వరకు ఉంటోంది. అంటే రూ.4,000 కోట్ల వ్యత్యాసం ఉంటుంది. ఈ మొత్తాన్ని అప్పులు, పన్నేతర రాబడి మార్గాల ద్వారా ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి వస్తోంది. అయినా... ప్రభుత్వం రూ.2000 కోట్లను కూడబెట్టి పెన్షనర్ల బిల్లుల క్లియరెన్స్‌కు మళ్లించింది. దీంతో ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - May 30 , 2026 | 04:22 AM