నేటి నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
ABN , Publish Date - Apr 27 , 2026 | 05:10 AM
ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ నుంచి మే నెల 23 తేదీ వరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు...
రాష్ట్రవ్యాప్తంగా 200 బృందాలు: మంత్రి తుమ్మల
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ నుంచి మే నెల 23 తేదీ వరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, వ్యవసాయశాఖ అధికారులు కలిపి 200 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీరు 400 గ్రామాల్లో రైతులతో నేరుగా సమావేశాలు నిర్వహిస్తారని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూరియా వాడకం తగ్గింపు, సమతుల్య ఎరువుల వినియోగం, పంట మార్పిడి, మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి విత్తనాల సాగు, సాగునీటి ఆదా, సేంద్రియ వ్యవసాయం లాంటి అంశాలపై సుమారు 2.45 లక్షల మంది రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖ అధికారులు, రైస్‌మిల్లర్లతో చర్చల అనంతరం రాష్ట్రంలో సాగుకు అనువైన, అధిక దిగుబడి ఇచ్చే 8 సన్నరకాలను గుర్తించినట్లు తెలిపారు. బీపీటీ- 5204, తెలంగాణ (ఆర్‌ఎన్‌ఆర్- 15048), కేఎన్‌ఎం- 1638, జైశ్రీరామ్, హెచ్‌ఎంటీ, వరంగల్- 962, వరంగల్- 44, టీజీసీ- 1798 రకాలను సాగుచేస్తే మార్కెట్లో డిమాండ్ ఉంటుందని వివరించారు. వరితోపాటు రైతులు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, పామాయిల్ సాగుచేసేలా అవగాహన కల్పించాలని క్షేత్రస్థాయికి వెళ్లే బృందాలకు ఆయన సూచించారు.