Share News

రూ.200 కోట్ల సర్కారు భూమిని కాజేశారు

ABN , Publish Date - Jul 08 , 2026 | 06:33 AM

ధరణిలో లోపాలను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు జరిపిన భూ బాగోతాలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల పందేరాలను కొందరు అధికారులు..

రూ.200 కోట్ల సర్కారు భూమిని కాజేశారు

  • నిషేధిత జాబితాలోని ప్రభుత్వ భూమిని

  • పట్టా చేసి పాస్‌బుక్‌ ఇచ్చిన అధికారులు

  • నగర శివార్లలో మరో ‘ధరణి’ బాగోతం

  • అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మునగనూరులో 12 ఎకరాలు పరాధీనం

  • అర్ధరాత్రి సమయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

  • రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, పాస్‌పుస్తకం, నాలా రికార్డుల్లో వేర్వేరు సర్వే నంబర్లు

  • సుమోటోగా విచారణ చేపట్టిన సీసీఎల్‌ఏ

  • (ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

ధరణిలో లోపాలను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు జరిపిన భూ బాగోతాలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల పందేరాలను కొందరు అధికారులు.. ప్రభుత్వం మారాక కూడా కొనసాగిస్తున్నారు. ధరణిని అడ్డుపెట్టుకొని హైదరాబాద్‌ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మునగనూరులో రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు అన్యాక్రాంతం చేశారు. తొలుత ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చి.. వాటికి ఆగమేఘాల మీద పాస్‌బుక్‌లు జారీ చేశారు. ఆపై వ్యవసాయేతర(నాలా) భూమిగా మార్చేశారు. ఈ వ్యవహారం ఇటీవలే ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఆ భూములను తిరిగి నిషేధిత జాబితాలో పెట్టారు. ఈ కేసును సీసీఎల్‌ఏ సుమోటోగా తీసుకుని శాఖాపరమైన విచారణ చేపట్టింది. వివరాల్లోకి వెళితే.. మునగనూరులోని సర్వే నంబరు 44లో 44.10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమిని గతంలో పేదలకు అసైన్‌ చేశారు. మిగతా భూమి ప్రభుత్వ రికార్డుల్లో.. ప్రభుత్వ, పోరంబోకు భూమిగా నమోదైంది. అలాగే సర్వే నంబరు 44/2లోని 4.25 ఎకరాలు, 44/4లోని 7.16 ఎకరాలు కలిపి మొత్తం 12.01 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగానే రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. గత కొన్ని దశాబ్దాలుగా రికార్డుల్లో ఈ భూములను ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ క్రయవిక్రయాలు జరగకుండా నిషేధిత జాబితాలో పెట్టారు. విజయవాడ హైవే- నాగార్జునసాగర్‌ హైవేలకు మధ్యలో ఉండే ఈ భూములు అత్యంత ఖరీదైనవి. ఎంత లేదన్నా ఎకరం రూ.15 కోట్లకుపైనే ధర పలుకుతుంది. భూమి విలువ రూ.200 కోట్ల వరకు ఉంటుంది.


ధరణిలోని లోపాల ఆధారంగా..

గత ప్రభుత్వ హయాంలో ఈ భూములపై కన్నేసిన కొందరు వీటిని కాజేసేందుకు స్కెచ్‌ వేశారు. ఇందుకోసం ధరణిలో పట్టాదారు పాస్‌బుక్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రికార్డుల్లో ఈ భూమిని సర్కారు/పోరంబోకుగా పేర్కొన్నప్పటికీ.. అధికారులు ఈ దరఖాస్తును తిరస్కరించకుండా డిజిటల్‌ సైన్‌ పెండింగ్‌లో ఉంచారు. ఇదంతా 2020-21లో రికార్డుల్లో నమోదైంది. అనంతరం ప్రభుత్వం మారడంతో కొన్నాళ్లపాటు మౌనంగా ఉన్నారు. తమకు అనుకూలమైన అధికారులు రాగానే మళ్లీ పావులు కదిపారు. భూమి ప్రభుత్వానిదే అయినా.. లింకు డాక్యుమెంట్లు కూడా సరిగా లేకపోయినా ఒక సర్వే నంబరు మీద రిజిస్ట్రేషన్‌ చేశారు. కె.సులోచన అనే మహిళ పేరు మీద సర్వేనంబరు 44/4లోని 7.16 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేశారు. అనంతరం ఆమె పేరిట పట్టాదారు పాస్‌పుసక్తం కూడా జారీ చేశారు. ఆ పాస్‌పుస్తకం ఆధారంగా ఈ భూమిని సులోచన 2024 మే 28 రాత్రి 9.29 గంటలకు మేరుగు గోపాల్‌ అనే వ్యక్తికి విక్రయించారు. అదే విధంగా 44/2లోని 4.25 ఎకరాలను కూడా సులోచన పేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేసి.. పాస్‌పుస్తకం జారీ చేశారు. ఆపై ఆ భూమిని కూడా సులోచన.. మేరుగు గోపాల్‌కే విక్రయించినట్లు 2024 జూన్‌ 26 రాత్రి 11.17 గంటలకు రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇలా రెండు దశల్లో ప్రభుత్వ భూమిని అర్ధరాత్రి పట్టా భూమిగా మార్చే పక్రియ పూర్తిచేశారు.


70 ఏళ్ల రికార్డుల్లో ప్రభుత్వ భూమి

మునగనూరులోని సర్వే నంబరు 44/2, 44/4లోని 12.01 ఎకరాల భూమి గడిచిన 70 ఏళ్లుగా ప్రభుత్వ భూమిగా అన్ని రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. ఫ్రభుత్వం ఈ భూముల క్రయవిక్రయాలు జరగకుండా నిషేధిత జాబితాలో పెట్టింది. అయినా కూడా రెవెన్యూ అధికారులు సర్కార్‌ భూములను పందేరం చేశారు. ఎవరైనా ఈ భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డులు వెరిఫై చేసినా కూడా అంత తొందరగా వివరాలు దొరకవు. 44/2, 44/4 సర్వేనంబర్లకు సంబంధించి ఈసీలో చూస్తే 44/8, 44/9 సర్వేనంబర్లు ప్రత్యక్షమవుతాయి. 44/8, 44/9లోనే రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రికార్డుల్లో ఉంటాయి. అంతేకాదు. సేల్‌ డీడ్‌ జరిగిన తేదీ కూడా ఈసీలో మారిపోయింది ఇదేలా సాధ్యమో తెలియడం లేదు. రిజిస్ట్రేషన్లు జరిగిన రెండు, మూడు రోజుల తరువాత ఈ లావాదేవీలు జరిగినట్లుగా ఈసీలో చూపిస్తోంది.


3 సార్లు సర్వే నంబర్ల మార్పు

సాధారణంగా ఎవరైనా ఒక సర్వే నంబరులో భూమిని కొనుగోలు చేస్తే.. అతని పేరు మీద జారీ చేసే పట్టాదారు పాస్‌పుస్తకంలో... రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌లో ఉన్న సర్వే నంబరు, విస్తీర్ణం వివరాలు యథాతథంగా ఉంటాయి. దాని ఽఆధారంగానే భవిష్యత్తులో క్రయవిక్రయాలు జరుగుతాయి. కానీ మునుగనూరు భూముల వ్యవహారంలో తమకు కావాల్సిన రీతిలో రికార్డుల్లో మూడుసార్లు మార్పులు చేసుకున్నారు. సర్వే నంబర్లు 44/2, 44/4లోని మొత్తం 12.01 ఎకరాలను మేరుగు గోపాల్‌ కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలో ఉంది. అయితే ఆ తరువాత జారీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో మాత్రం సర్వే నంబర్లను 44/10, 44/11గా పేర్కొన్నారు. అనంతరం నాలాగా మార్చిన అప్పటి తహసీల్దార్‌.. దానికి సంబంధించిన ధ్రువపత్రంలో పైన పేర్కొన్న రెండు సర్వేనంబర్లూ కాకుండా 44/8, 44/9గా పేర్కొన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 06:34 AM