18 నిమిషాలపాటు చంద్రగ్రహణం
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:12 AM
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా హైదరాబాద్ వాసులకు చంద్రుడు కనువిందు చేశాడు. సాయం సంధ్యాసమయంలో ఉత్తర భాగం ఎడమ వైపున కనిపించిన చంద్రుడు ......
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాల మూసివేత
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా హైదరాబాద్ వాసులకు చంద్రుడు కనువిందు చేశాడు. సాయం సంధ్యాసమయంలో ఉత్తర భాగం ఎడమ వైపున కనిపించిన చంద్రుడు 18 (6.30 గంటల నుంచి 6.48 గంటల వరకు) నిమిషాలు ఎరుపు రంగులో ఆవిష్కృతం కావడంతో నగర వాసులు ఆసక్తిగా తిలకించారు. చాలా తక్కువ సమయం ఉత్తరభాగంలో కొంత భాగం కట్ అయినట్లు వచ్చిన దృశాన్ని వీక్షించారు. ఉస్మానియా యూనివర్శిటీ, బిర్లా ప్లానిటోరియంలలో ఎరుపు వర్ణ గ్రహణాన్ని వీక్షించారు. మధ్యాహ్నం 2.13గంటలకు తన బాహ్యనీడలో చంద్రుడు అడుగు పెట్టగా, మధ్యాహ్నం 3.20గంటల నుంచి 6.48గంటల వరకూ గ్రహణం కొనసాగింది. కాగా, చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మూత పడ్డాయి. గ్రహణం వీడిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా ఆలయాలను శుద్ధి చేశారు. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం.. తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం, వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయాల్లో అర్చకులు మంగళవారం వేకువ జామున సుప్రభాత సేవ, ఆరాదన, నివేదన, అభిషేకం, అర్చనల తర్వాత ఆలయాల ప్రధాన ద్వారాలు మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత ఆలయాల శుద్ధి, ప్రదోషపూజ, శాంతి హోమం, తర్వాత భక్తులకు అనుమతినిచ్చారు. ఇక యాదగిరిగుట్ట, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహస్వామి, కొండగట్టు అంజన్న ఆలయాలు బుధవారం ఉదయం తెరుచుకోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు మూత పడ్డా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మాత్రం గ్రహణ కాలాభిషేకం నిర్వహించగా, యధావిధిగా ముక్కంటిని భక్తులు దర్శించుకున్నారు.