Share News

1970కి ముందు భూ లావాదేవీలకు1/70 చట్టం వర్తించదు

ABN , Publish Date - May 12 , 2026 | 04:01 AM

గిరిజన ప్రాంతా ల్లో గిరిజనేతరులు భూములు కొనుగోలు చేయకుండా నిషేధించే ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ ఏరియా ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ అమెండ్‌మెంట్‌ రెగ్యులేషన్‌...

1970కి ముందు భూ లావాదేవీలకు1/70 చట్టం వర్తించదు

  • వివాదంలో ఉన్న భూమిని కొన్నవారికి దానిపై హక్కులుండవు: హైకోర్టు

హైదరాబాద్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతా ల్లో గిరిజనేతరులు భూములు కొనుగోలు చేయకుండా నిషేధించే ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ ఏరియా ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ అమెండ్‌మెంట్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌- 1970 (1/70 చట్టం).. 1970కి ముందు జరిగిన భూలావాదేవీలకు వర్తించదని హైకోర్టు ప్రకటించింది. ఈ చట్టం ఎప్పటినుంచి అమలులోకి వచ్చిందో అప్పటి నుంచి జరిగిన భూ లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టంచేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలోని 148 సర్వే నెంబరులో ఉన్న 14.09 ఎకరాల భూమిని నాగుబండి మల్లయ్య నుంచి కర్రి కోటేశ్వరరావు 1959లో కొనుగోలు చేశారు. సదరు భూమి తమదని, దానిని తన తండ్రి 1973లో నాగుబండి మల్లయ్య భార్య నాగుబండి వెంకట రత్నమ్మ నుంచి కొనుగోలు చేశారని చంచుపల్లి గ్రామ పరిధిలోని రాందాస్‌ తండాకు చెందిన మాలోత్‌ శ్రీను క్లెయిమ్‌ చేశారు. గిరిజన ప్రాం తాల్లో గిరిజనేతరులు భూములు కొనడం చెల్లదు కాబట్టి ఆ భూములు తనవేనని వాదించటంతో రెవెన్యూ అధికారులు ఆయనకు అనుకూలంగా ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ కర్రి కోటేశ్వరరావు, ఆయన వారసులు 2013లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం తాజాగా సమగ్ర విచారణ నిర్వహించి తీర్పు చెప్పింది. పిటిషనర్‌ ఆ భూమి ని 1/70 చట్టం రాకముందు 1959లోనే కొనుగోలు చేసినందున.. అది చట్టబద్ధమేనని స్పష్టంచేసింది. హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన తర్వాత మాలోత్‌ శ్రీను అక్రమంగా మ్యుటేషన్లు చేయించుకుని రిజిస్ర్టేషన్‌లు లేకుండానే ఆ భూమిని విక్రయించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని జిల్లా కలెక్టర్‌ తన రిపోర్టులో తెలిపారని గుర్తుచేసింది. ఈ అక్రమాల్లో ప్రభుత్వ అధికారుల పాత్ర సైతం ఉందని పేర్కొంది. ప్రతివాదికి అనుకూలంగా అప్పీలేట్‌, రివిజనల్‌ అథారిటీలు ఇచ్చిన తీర్పులు న్యాయసమీక్షకు నిలబడవని తీర్పు చెప్పింది. వివాదంలో ఉన్న ఈ భూమిని కొనుగోలు చేసినవారికి ఎలాంటి హక్కులు ఉండవని, వారు తాము చెల్లించిన డబ్బును రికవరీ చేసుకోవచ్చని సూచించింది.

Updated Date - May 12 , 2026 | 04:01 AM