Cyber Criminals: 547 కోట్లు కొల్లగొట్టిన మోసగాళ్లు
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:32 AM
మోసపూరిత ఫైల్స్ పంపి అమాయకుల నుంచి రూ.547 కోట్లు కొల్లగొట్టిన 17 మంది సైబర్ నేరగాళ్ల ఆట కట్టించినట్లు ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు.
17 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు
మ్యూల్ ఖాతాలతో లావాదేవీలు
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ వెల్లడి
సత్తుపల్ల్లి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మోసపూరిత ఫైల్స్ పంపి అమాయకుల నుంచి రూ.547 కోట్లు కొల్లగొట్టిన 17 మంది సైబర్ నేరగాళ్ల ఆట కట్టించినట్లు ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. వీరంతా సైబర్ నేరాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బును మ్యూల్ ఖాతాలకు, ఆ తర్వాత సొంత ఖాతాలకు మళ్లించి సొమ్ము చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఆదివారం ఖమ్మం జిల్లాలోని వీఎం బంజర్ పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన మోదుగు సాయికిరణ్ గతేడాది డిసెంబరు 24న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ కేసు విచారణ సందర్భంగా మొదట ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్‌ను అరెస్టు చేసినట్టు సీపీ తెలిపారు. నిందితుల వద్ద ఉద్యోగాలు చేస్తూ ఈ మోసంలో సహకరించిన వారు, వచ్చిన డబ్బును ఖాతాల్లోకి మళ్లించేందుకు అమాయకులతో మోసపూరితంగా ఖాతాలు ఓపెన్ చేయించారని, ఇలా మొత్తం రూ.547 కోట్లు దోచేశారని తెలిపారు. ఈ మోసంతో సంబంధమున్న మొత్తం 17 మందిని ఆదివారం అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరంతా అంతర్జాతీయ సైబర్ క్రైం నేరస్థులతో జతకట్టి ఆస్ట్రేలియా, కంబోడియా తదితర దేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ.. వాటి ద్వారా మన దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాల వారిని కూడా మోసగిస్తున్నారని సునీల్‌దత్ తెలిపారు.