Share News

1600 మంది ఆర్టిజన్లకు నోటీసులు

ABN , Publish Date - Apr 11 , 2026 | 04:56 AM

సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న విద్యుత్‌ ఆర్టిజన్లతో ఇంధనశాఖ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టిజన్‌ జేఏసీ చైర్మన్‌ సతీశ్‌రెడ్డితో శుక్రవారం ...

1600 మంది ఆర్టిజన్లకు నోటీసులు

  • 24 గంటల్లోగా విధుల్లో చేరకుంటే సర్వీసు నుంచి తొలగిస్తామంటూ జెన్‌కో హెచ్చరికలు

  • సమస్యలు తీర్చిన తర్వాతే సమ్మె వీడుతామని ఆర్టిజన్ల స్పష్టీకరణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న విద్యుత్‌ ఆర్టిజన్లతో ఇంధనశాఖ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టిజన్‌ జేఏసీ చైర్మన్‌ సతీశ్‌రెడ్డితో శుక్రవారం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముందు గా సమ్మె వీడాలని, ఆ తర్వాత జేఏసీ డిమాండ్లపై అవసరమైన చర్యలు తీసుకుంటామని నవీన్‌ మిట్ట ల్‌ ప్రతిపాదించారు. సమస్యలను పరిష్కరించిన తర్వాతే తాము సమ్మెను విరమిస్తామంటూ సతీశ్‌ రెడ్డి తేల్చిచెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో ఉన్న ఆర్టిజన్లకు జెన్‌కో నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. శుక్రవారం ఒక్కరోజే 1600 మంది కార్మికులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందిన 24 గంటల్లోగా విధుల్లో చేరని పక్షంలో సర్వీసుల నుంచి తొలగిస్తామని జెన్‌కో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కాగా, హైదరాబాద్‌, విద్యుత్‌ సౌధ వంటి చోట్ల పనిచేస్తున్న ఆర్టిజన్లు సమ్మెలో లేరు.

ఆర్టిజన్లపై కఠిన చర్యలు వద్దు: కూనంనేని

సమ్మెలో ఉన్న అర్టిజన్లపై ఎస్మా, డిస్మిస్‌, మెమో లాంటి బెదరింపు దోరణితో ఇబ్బందులకు గురి చేయవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాం బశివరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు శుక్రవారం సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. కార్మికుల న్యాయపరమైన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం పట్టింపులకు పోకుండా వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని సాంబశిరావు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Apr 11 , 2026 | 04:56 AM