పాపం కోతులు
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:47 AM
మూగజీవాలైన కోతులపై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. ఆపై, మరణించిన, అపస్మారక స్థితికి చేరుకున్న పదుల సంఖ్యలో కోతులను రోడ్డు పక్కన పారేసి వెళ్లిపోయారు.
వానరాలపై దుండగుల విష ప్రయోగం.. 15 కోతుల మృతి
మైకంలో మరికొన్ని ..కామారెడ్డి జిల్లా అంతపల్లిలో ఘటన
భిక్కనూరు, జనవరి 21(ఆంధ్రజ్యోతి): మూగజీవాలైన కోతులపై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. ఆపై, మరణించిన, అపస్మారక స్థితికి చేరుకున్న పదుల సంఖ్యలో కోతులను రోడ్డు పక్కన పారేసి వెళ్లిపోయారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని అంతంపల్లి గ్రామ శివారులో బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అంతంపల్లి సర్పంచ్ మంజుల, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 44వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డుపై 25 కోతులు నిర్జీవంగా పడి ఉండడాన్ని స్థానికులు పరిశీలించగా వాటిలో 15 కోతులు మరణించగా మిగిలినవి మైకంలో ఉన్నాయి. స్థానికుల సమాచారంతో పశువైద్య సిబ్బంది ఆ వానరాలను పరిశీలించి, మత్తు వదలడానికి వాటికి ఇంజక్షన్లు చేశారు. ఇక, మరణించిన కోతులను స్థానికులు సమీపంలో పూడ్చి పెట్టారు. కాగా, కోతులను ఎక్కడో పట్టుకుని వచ్చి తమ గ్రామం వద్ద వదిలేస్తున్నారని, అటవీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని సర్పంచ్ మంజుల ఆవేదన వ్యక్తం చేశారు.