Share News

అక్కడ యుద్ధం.. ఇక్కడ భయం

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:26 AM

ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధం గల్ఫ్‌ దేశాలన్నింటికీ చుట్టుకోవటంతో అక్కడ ఉన్న తెలుగువారి భద్రతపై తెలుగు రాష్ట్రాల్లోని వారి బంధువులు ఆందోళన ......

అక్కడ యుద్ధం.. ఇక్కడ భయం

  • గల్ఫ్‌ దేశాల్లో 15 లక్షల మంది తెలంగాణవాసులు.. ఉత్తర తెలంగాణకు చెందినవారే 9 లక్షల మంది

  • యుద్ధం నేపథ్యంలో వారి బంధువుల్లో ఆందోళన

కరీంనగర్‌/దుబ్బాక/ సుభాష్‌‌నగర్‌/నల్లగొండ/రెజిమెంటల్‌ బజార్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధం గల్ఫ్‌ దేశాలన్నింటికీ చుట్టుకోవటంతో అక్కడ ఉన్న తెలుగువారి భద్రతపై తెలుగు రాష్ట్రాల్లోని వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. సౌదీ అరేబియా, దుబాయి, అబుదాబీ, షార్జా, ఒమన్‌, ఖతార్‌, బహ్రెయిన్‌, కువైట్‌ తదితర దేశాల్లో ఉన్న 90 లక్షల మంది భారతీయుల్లో 15 లక్షల మంది తెలంగాణ వారు, మరో 15 లక్షల మంది ఆంధ్రప్రదేశ్‌ వాసులున్నారని అంచనా. ఉత్తర తెలంగాణలోనికరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నుంచి 2.5 లక్షల మంది.. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల నుంచి 2 లక్షల మంది.. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి 1.5 లక్షల మంది వలసవెళ్లి గల్ఫ్‌ దేశాల్లో జీవనం సాగిస్తున్నారు. సిద్దిపేట జిల్లా వాసులు 15 వేల మంది అక్కడ వివిధ పనులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌లో నిజామాబాద్‌ జిల్లా వాసులు 700 మంది వరకు ఉన్నారు. ఉమ్మడి నల్లగొండకు చెందిన చాలామంది కార్మికులు యూఏఈ, ఒమన్‌ తదితర దేశాల్లో పనిచేస్తున్నారు. ఈ దేశాలపై ఇరాన్‌ క్షిపణి, డ్రోన్‌ దాడులు చేస్తుండటంతో ఆయా దేశాల్లోని కంపెనీలు పనులు నిలిపివేశాయి. రెండు రోజులుగా వలస కార్మికులంతా బంకర్లకే పరిమితమయ్యారు. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి తెల్లవారే వరకు బాంబుల మోతలతో దద్దరిల్లిపోతుంటే బంకర్లలో తలదాచుకుంటున్నట్లు వారు తమ బంధువులకు చెబుతున్నారు. క్షేమంగానే ఉన్నామని వారు చెబుతున్నా.. ఇక్కడ ఉన్న కుటుంబసభ్యులు మాత్రం ఆందోళనతోనే గడుపుతున్నారు.


మంత్రుల భరోసా..

మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లు వలస కార్మికుల బంధువులతో మాట్లాడి ధైర్యం చెబుతున్నారు. ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ కూడా గల్ఫ్‌ ప్రవాసులరక్షణకు చర్యలు చేపడతామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో గల్ఫ్‌ కార్మికుల సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. అబుదాబీ (యూఏఈ) టోల్‌ఫ్రీ నంబర్‌ 800-46342, వాట్సాప్‌+971543 090571, కువైట్‌ + 96565 501946, బహ్రెయిన్‌ 00973-39418071, మస్కట్‌ (ఒమన్‌) 800 71 234, జోర్డాన్‌ 00962 770422 276, బాగ్దాద్‌ (ఇరాక్‌)+ 964 771 651 1185, టెహ్రాన్‌ (ఇరాన్‌) +9891 281 09115, సౌదీ అరేబియా 00 966 114 884 697, దోహా (ఖతార్‌) 00974 5564 7502, పాలస్తీనా +970 592916418 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. గల్ఫ్‌ కార్మికుల కోసం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. కార్మికులు 87126 59700, 87126 59821 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.

నిత్యం సంప్రదింపులు

కరీంనగర్‌ జిల్లా మానకొండూరుకు చెందిన ఎండీ ఫర్వేజ్‌, ఎండీ ఇర్ఫాన్‌తోపాటు 15 మంది దుబాయిలోని వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నారు. వారు తమ కుటుంబసభ్యులతో మాట్లాడి క్షేమంగానే ఉన్నామని చెప్పారు. రామడుగు మండలం గోపాల్‌రావుపేటకు చెందిన సీపెల్లి సురేందర్‌ ఏడాది క్రితం ఇజ్రాయిల్‌కు వెళ్లి, ఎయిర్‌పోర్టులో క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. సేఫ్‌జోన్‌లోనే ఉన్నట్లు ఆయన తన భార్యకు ఫోన్‌ చేసి చెప్పాడు. గంగాధర మండలం లక్ష్మిదేవిపల్లికి చెందిన 17 మంది దుబాయిలో పనిచేస్తున్నారు. వీరు నివాసముంటున్న క్యాంపునకు సమీపంలో ఉన్న పామ్‌ జుమైరా హోటల్‌పై బాంబుపడిందని, ఆ హోటల్‌లో ఎక్కువగా అమెరికా టూరిస్టులు ఉంటారని ప్రశాంత్‌ అనే కార్మికుడు ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్‌లో తెలిపాడు. బాంబు దాడిని ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం వడ్డెర కాలనీకి చెందిన కనకరాజు దుబాయి నుంచి ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న భద్రతా చర్యలతో తాము ధైర్యంగానే ఉన్నామని తెలిపారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. తెలంగాణ పౌరుల భద్రత కోసం సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు దీన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విదేశాంగ శాఖతో పాటు ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో తెలంగాణ భవన్‌ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్ర పౌరులకు ఏమైనా ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులు ఎదురైతే కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించాలని ముఖ్య మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 9871999044, 58322143, 991014749, 9643723157 నంబర్లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

Updated Date - Mar 03 , 2026 | 04:26 AM