Share News

Land Registration Scam: భూ భారతి కేసులో 15 మంది అరెస్టు

ABN , Publish Date - Jan 17 , 2026 | 05:55 AM

ధరణి, భూభారతి పోర్టల్‌లో లొసుగులను ఆసరాగా చేసుకొని రిజిస్ట్రేషన్‌ చలానాల సొమ్మును కాజేసిన కేసులో పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు.

Land Registration Scam: భూ భారతి కేసులో 15 మంది అరెస్టు

  • పరారీలో మరో 9 మంది నిందితులు

  • జనగామ కేంద్రంగా రిజిస్ట్రేషన్‌ చలానా మోసాలు

  • రూ.3.90 కోట్ల సర్కారు ఆదాయం దారి మళ్లింపు

  • మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా ఖజానాకు గండి

  • వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ వెల్లడి

వరంగల్‌ క్రైం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ధరణి, భూభారతి పోర్టల్‌లో లొసుగులను ఆసరాగా చేసుకొని రిజిస్ట్రేషన్‌ చలానాల సొమ్మును కాజేసిన కేసులో పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం 24 మందిపై కేసు నమోదు చేయగా.. 9 మంది పరారీలో ఉన్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. శుక్రవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సీపీ ఈ వివరాలను వెల్లడించారు. మీసేవ కేంద్రాలు, ఆన్‌లైన్‌ కేంద్రాలు నిర్వహించే వ్యక్తులు ముఠాగా ఏర్పడి మొబైల్‌ ఆప్లికేషన్‌ వినియోగించి ప్రభుత్వ ఆదాయానికి రూ.3.90 కోట్ల గండి కొట్టినట్లు తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంగా ఈ మోసాలు జరుగుతున్నట్లుగా పోలీస్ శాఖకు సమాచారం అందిందని, దీంతో ఈ నెల 7న జనగామ పోలీస్ స్టేషన్‌లో ఫైనాన్స్‌, ఫోర్జరీ, సైబర్‌ క్రైం, క్రిమినల్‌తోపాటు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు.


సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లాకు చెందిన పసునూరి బసవరాజు, జెల్లా పాండు, మహేశ్వర్‌ గణేశ్‌ అనే ముగ్గురు వ్యక్తులు మీసేవ కేంద్రాలు నిర్వహిస్తూ భూ భారతి వెబ్‌సైట్‌లో భూముల రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌లు బుక్‌ చేసేవారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించే పద్ధతిలో దరఖాస్తుదారుల నుంచి డబ్బులు తీసుకొని ప్రభుత్వానికి చెల్లించే క్రమంలో మోసాలకు పాల్పడేవారు. పెద్ద మొత్తంలో దరఖాస్తులు స్వీకరించేందుకు.. ఆన్‌లైన్‌ కేంద్రాలు నిర్వహించే జనగామకు చెందిన గాజులపాటి శ్రీనాథ్‌, ఎనగందుల వెంకటేశ్‌, కొడుతూరి శ్రావణ్‌, కొడకండ్లకు చెందిన కొలిపాక సతీశ్‌, నర్మెట కు చెందిన తాడూరి రంజిత్‌, యాదాద్రి జిల్లా ఆత్మకూరుకు చెందిన దుంపల కిషన్‌రెడ్డి, తుర్కపల్లికి చెందిన దశరఽథ మేగావత్‌, యాదగిరిగుట్టకు చెందిన నారా భానుప్రసాద్‌, గోపగాని శ్రీనాథ్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్‌కు చెందిన కమల్ల శివకుమార్‌, ఒగ్గు కరుణాకర్‌, ఆలేటి నాగరాజుతో ముఠాగా ఏర్పడి వారిద్వారా దరఖాస్తులు తెప్పించుకొనేవారు. మధ్యవర్తులుగా ముఠాలో చేరిన సభ్యులకు ప్రతీ దరఖాస్తుకు 10 నుంచి 30శాతం వరకు కమీషన్‌ ముట్టజెబుతూ ప్రధాన నిందితులు రూ.కోట్లు కొల్లగొట్టారని సీపీ వెల్లడించారు.


మొబైల్‌ ఆప్లికేషన్‌ ద్వారా..

ప్రధాన సూత్రధారులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండు, మహేశ్వరం గణేశ్‌లు ధరణి, భూభారతిలో ఉన్న లొసుగుల ఆధారంగా.. ప్రభుత్వానికి చెల్లించే డబ్బులను మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా తమ జేబుల్లో మళ్లించుకునేవారని వరంగల్‌ సీపీ చెప్పారు. జనగామ, యాదాద్రిలో జిల్లాల్లో 1,080 పత్రాలకు సంబంధించిన లావాదేవీల్లో రూ.3.90 కోట్లను ప్రభుత్వ ఖజానాకు వెళ్లకుండా గండికొట్టారని పేర్కొన్నారు. ఇందులో జనగామ జిల్లా నుంచి రూ.17 లక్షలకు పైగా, యాదాద్రి జిల్లా నుంచి రూ.3.72 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఈ కుంభకోణంపై జనగామ జిల్లాలో 7 కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కే సులు నమోదయ్యాయన్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి రూ.63.19 లక్షల నగదు, రూ.కోటి విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్‌టా్‌పలు, ఐదు డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, 17 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకునట్లు, బ్యాంకులో రూ.లక్ష ఫ్రీజ్‌ చేసినట్లు వివరించారు. మిగతా డబ్బును నిందితులు ఖర్చు చేశారని, పరారీలో ఉన్న మరో 9 మంది నుంచి కొంత రికవరీ చేయాల్సి ఉందని అన్నారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, ఏసీపీ పండరి చేతన్‌, ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణరెడ్డి, రఘునాథపల్లి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఎస్సై నరేశ్‌, శ్రవణ్‌కుమార్‌లను సీపీ అభినందించి రివార్డులు అందజేశారు.

Updated Date - Jan 17 , 2026 | 05:56 AM