రాష్ట్రంలో యూకే స్కూళ్లు!
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:03 AM
అద్భుతమైన అంతర్జాతీయ వసతులు కలిగిన హైదరాబాద్‌పై అంతర్జాతీయ విద్య సంస్థలు దృష్టిసారించాయి. ఇప్పటికే ఐటీ కంపెనీలు, బయో సంబంధిత సంస్థలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు....
హైదరాబాద్‌లో 13 ప్రఖ్యాత విద్యాసంస్థల క్యాంప్‌సల ఏర్పాటుకు ఆసక్తి
రేపు రాష్ట్రంలో పర్యటించనున్న యూకే ఉన్నతస్థాయి బృందం
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): అద్భుతమైన అంతర్జాతీయ వసతులు కలిగిన హైదరాబాద్‌పై అంతర్జాతీయ విద్య సంస్థలు దృష్టిసారించాయి. ఇప్పటికే ఐటీ కంపెనీలు, బయో సంబంధిత సంస్థలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు మన మహానగరంపై ఆసక్తి చూపుతుండగా... తాజాగా విద్యా సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వరుస కడుతున్నాయి. ఇందులో భాగంగా యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు చెందిన 13 ప్రఖ్యాత పాఠశాలలు హైదరాబాద్‌లో తమ క్యాంప్‌సలను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. ఈ మేరకు యూకే ప్రభుత్వం నుంచి తెలంగాణ సర్కారుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఈ నేపథ్యంలో యూకే డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ నెల 18న రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ సందర్భంగా స్థానిక ఉన్నతాధికారులతో యూకే ప్రతినిధులు కీలక సమాలోచనలు జరపనున్నారు. ఈ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంలో 13 యూకే స్కూళ్లకు సంబంధించిన ప్రతినిధులు, యూకే ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. తెలంగాణలోకి రానున్న ప్రైవేటు విద్యా సంస్థలు.. కేజీ టూ ప్లస్ 2 కరికులంలో అగ్రగామిగా పేరొందాయి. స్థానికంగా విద్యా శాఖ ఉన్నతాధికారులు, వివిధ శాఖలు, మునిసిపల్, విద్యా, ఐటీ, ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీకి చెందిన అధికారులు యూకే ప్రతినిధులతో చర్చించనున్నారు. యూకే విద్యా సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే క్యాంప్‌సలకు ఎప్పటి వరకు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న దానిపై చర్చలు సాగనున్నాయి. ఇదిలా ఉండగా.. యూకేకు చెందినవిశ్వవిద్యాలయాలు సైతం తెలంగాణలో వాటి క్యాంప్‌సలు ఏర్పాటు చేేసందుకు అవసరమైన చర్యలు కీలక దశకు చేరుకున్న విషయం విదితమే. ఈ క్యాంప్‌సలు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు సమగ్రంగా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా ఒక ఎడ్యుకేషన్ జోన్‌లో ప్రపంచస్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వ అడుగులు పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ మేరకు అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రంలోకి ఆహ్వానించేందుకు ప్రజా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.