Share News

12 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి సహ చట్టం నివేదిక

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:50 AM

సమాచార హక్కు చట్టం వార్షిక నివేదిక సిద్ధమైంది. 2014లో రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల అనంతరం మొట్టమొదటి సమాచార కమిషన్‌ ఏర్పాటు చేయగా..

12 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి సహ చట్టం నివేదిక

హైదరాబాద్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు చట్టం వార్షిక నివేదిక సిద్ధమైంది. 2014లో రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల అనంతరం మొట్టమొదటి సమాచార కమిషన్‌ ఏర్పాటు చేయగా.. అప్పటి నుంచి గత 12 సంవత్సరాల్లో ఇంతవరకు మూడుసార్లు కమిషన్లు ఏర్పాటైనా వార్షిక నివేదిక మాత్రం రూపొందించలేదు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు, ప్రభుత్వ శాఖల్లో దరఖాస్తుల పెండింగ్‌, కమిషన్‌ వద్ద పెండింగ్‌ కేసుల వివరాలన్నీ వార్షిక నివేదికలో పొందుపరుస్తారు. దీంతో చట్టం అమలులో లోటుపాట్లు, సమస్యలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ప్రతి ఏటా తప్పనిసరిగా వార్షిక నివేదికలు విడుదల చేస్తుండగా రాష్ట్రంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కొనసాగింది. గత కేసీఆర్‌ ప్రభుత్వంలో రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు అత్యంత అధ్వానంగా ఉందంటూ అనేక ప్రజా సంఘాలు విమర్శించాయి. రెండేళ్ల క్రితం కేంద్ర సమాచార కమిషన్‌ విడుదల చేసిన వార్షిక నివేదికలోనూ తెలంగాణలో చట్టం అమలు తీరును విమర్శించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది జూన్‌లో బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర సమాచార కమిషన్‌ చట్టం అమలులో లోటుపాట్లపై ప్రధానంగా దృష్టి సారించింది. ఉమ్మడి రాష్ట్రం 2012 నుంచి ఉన్న పెండింగ్‌లోని వేలాది దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించింది. ఇందులో భాగంగా వార్షిక నివేదిక సిద్ధం చేసి ఇటీవలే ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వ ఆమోదం అనంతరం దీనిని శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. తాము బాధ్యతలు స్వీకరించేనాటికి 22,686 కేసులు పెండింగులో ఉండగా.. గత 7 నెలల్లో 8,294 కేసులు పరిష్కరించామని శనివారం విడుదల చేసిన ప్రకటనలో కమిషన్‌ తెలిపింది. ప్రస్తుతం 14,392 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, మరో రెండు నెలల్లో అన్ని కేసులు పరిష్కరించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపింది.

Updated Date - Feb 01 , 2026 | 06:52 AM