Share News

12 మందికి 100 పర్సంటైల్‌

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:09 AM

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలయ్యాయి.

12 మందికి 100 పర్సంటైల్‌

  • హైదరాబాద్‌ నుంచి ఒకరు, ఏపీ నుంచి ఇద్దరు

  • జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 ఫలితాల విడుదల

  • రాజస్థాన్‌ నుంచి అత్యధికంగా ముగ్గురు టాపర్లు

  • 99.99తో ఎస్సీల్లో టాపర్‌గా ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల జనవరి 21-28 తేదీల మధ్య 326 నగరాల్లో 658 కేంద్రాల్లో తొలివిడత జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహించగా.. 13.04 లక్షల మంది హాజరయ్యారు. పేపర్‌-1 (బీఈ, బీటెక్‌) ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 12 మంది పూర్తి మార్కులు(100 పర్సంటైల్‌) సాధించారు. అత్యధికంగా రాజస్థాన్‌ నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరు ఈ ఘనతను సాధించారు. హైదరాబాద్‌ విద్యార్థి వివాన్‌ శరద్‌ మహీశ్వరి, ఏపీలోని సత్యసాయి జిల్లా హిందుపురానికి చెందిన నరేంద్ర బాబుగారి మహిత్‌, కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్‌ 100 పర్సంటైల్‌ సాధించిన వారిలో ఉన్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్ష రాసిన వారిలో 8.87 లక్షల మంది అబ్బాయిలుండగా, 4.67 లక్షల మంది అమ్మాయిలున్నారు. టాపర్లలో అందరూ అబ్బాయిలే ఉండటం విశేషం. హరియాణాకు చెందిన ఆవీ గ్రేవాల్‌ 99.996 పర్సంటైల్‌తో అమ్మాయిల్లో అత్యధిక పర్సంటైల్‌ సాధించి టాపర్‌గా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దేవ శ్రీవేశ్‌ 99.9992271 పర్సంటైల్‌తో ఎస్సీ విభాగంలో ఆలిండియా టాపర్‌గా నిలిచారు. పేపర్‌-2 బి-ఆర్క్‌, బి-ప్లానింగ్‌ పరీక్షల ఫలితాలు త్వరలో విడుదల చేస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది. ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2 జరుగుతుంది.


అమెరికా వద్దని ఐఐటీ ఎంచుకున్నా: వివాన్‌ శరద్‌

విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రణాళికాబద్ధంగా చదివానని, కళాశాల అధ్యాపకుల మార్గదర్శకంతో ఈ విజయం సాధ్యమైందని తెలంగాణ నుంచి టాపర్‌గా నిలిచిన వివాన్‌ శరద్‌ మహీశ్వరి తెలిపారు. ఫలితాల అనంతరం ఆయన తన విజయాన్ని ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. నాన్న వ్యాపారవేత్త కాగా అమ్మ సీఏ. అక్క కూడా సీఏ చదువుతోంది. స్వస్థలం ఢిల్లీ అయునా చిన్నప్పుడే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇంటర్‌ తర్వాత గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికాకు పంపాలని తల్లిదండ్రులు నిర్ణయించారని, తాను ఇక్కడే ఉండి ప్రతిష్ఠాత్మక ఐఐటి బాంబేలో ప్రవేశం పొందడం లక్ష్యంగా నిర్ణయించుకున్నానని వివాన్‌ తెలిపారు. ఐఐటీబాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరాలన్నది తన లక్ష్యమని చెప్పారు.

ఏఐలో స్థిరపడతా: మహిత్‌

రోజుకు 18 గంటలు చదివి 100 పర్సంటైల్‌ సాధించానని నరేంద్రబాబుగారి మహిత్‌ అన్నారు. మహిత్‌ చదువు నిమిత్తం తల్లిదండ్రులు మూడేళ్ల కిందట హిందుపురం నుంచి తిరుపతికి వచ్చి స్థిరపడ్డారు. తండ్రి నరేంద్రబాబు తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. బొంబాయి ఐఐటీలో సీటు సాధించి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో స్థిరపడతానని మహిత్‌ తెలిపారు.

అమ్మానాన్న ఒత్తిడి చేయలేదు కాబట్టే సాధించా: మోహిత్‌

పసల మోహిత్‌ తండ్రి కిరణ్‌ కుమార్‌ ప్రొద్దుటూరులో డాక్టర్‌, తల్లి సబిత జమ్మలమడుగు ప్రభుత్వ హాస్పిటల్లో డెంటిస్ట్‌. విజయవాడలో ఇంటర్‌ చదివాడు. బాంబే ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయడమే లక్ష్యం. రోజుకు నాలుగు గంటలు మాత్రమే చదువుతూ పరీక్షకు సిద్ధం అయ్యానని, ఇంట్లో కానీ, చదివే చోట కానీ ర్యాంకుల కోసం ఎలాంటి ఒత్తిడి లేకపోవడం వల్లే ఇది సాధ్యమైందని మోహిత్‌ చెప్పారు.

Updated Date - Feb 17 , 2026 | 06:13 AM