Share News

110 కోట్లతో అంబేడ్కర్‌ నాలెడ్జి సెంటర్‌

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:43 AM

తెలంగాణలో సంక్షేమ రాజ్య స్థాపనే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

110 కోట్లతో అంబేడ్కర్‌ నాలెడ్జి సెంటర్‌

  • నింబోలి అడ్డా హాస్టల్‌ ఆధునికీకరణకు రూ.25 కోట్లు

  • స్థలాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌/కవాడిగూడ/గోల్నాక, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సంక్షేమ రాజ్య స్థాపనే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ‘నాలెడ్జ్‌ విప్లవం’ తీసుకొస్తూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు ఉచిత డిజిటల్‌ కోచింగ్‌ అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. హైదరాబాద్‌లోని కవాడిగూడ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ భవన్‌ ప్రాంగణంలో రూ.110 కోట్లతో నిర్మించనున్న పది అంతస్తుల ‘బాబాసాహేబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ ్కర్‌ నాలెడ్జి సెంటర్‌’, అలాగే కాచిగూడలోని నింబోలి అడ్డాలో రూ.25 కోట్లతో పునర్నిర్మించనున్న మూడు అంతస్తుల ఎస్సీ హాస్టల్‌ స్థలాలను ఆయన సోమవారం పరిశీలించారు. సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌తో కలిసి వచ్చిన భట్టి, ముందుగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ఇవి భౌతికంగా కనబడే కట్టాడాలు మాత్రమే కాదని, వేలాదిమంది విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించేఆధునిక దేవాలయాలని అభివర్ణించారు. రూ.110 కోట్ల వ్యయంతో నిర్మించే అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌లో సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు 10 అంతస్తులు ఉంటాయని, ఇందులో స్టడీ సర్కిల్స్‌, డిజిటల్‌ లైబ్రరీ, కాన్ఫరెన్స్‌ హాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కూలి నాలీ చేసుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులు కోచింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చి ఇక్కడి వసతి ఖర్చుల భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్నారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా, ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచి ఎంతో మంది పేద విద్యార్థులను ఉన్నతోద్యోగులుగా తీర్చిదిద్దిన కాచిగూడ నింబోలి అడ్డా హాస్టల్‌ను రూ.25కోట్లతో అత్యాధునికంగా పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ భవనానికి ‘బాబు జగ్జీవన్‌ రామ్‌ నాలెడ్జి సెంటర్‌’గా నామకరణం చేశామని డిప్యూటీ సీఎం ప్రకటించారు.

Updated Date - Jun 09 , 2026 | 04:43 AM