రష్యా సైన్యం చెర నుంచి విముక్తి పొంది.. ఇళ్లకు చేరిన 11 మంది బాధితులు
ABN , Publish Date - Oct 09 , 2026 | 03:59 AM
ఏజెంట్ల మాటలు నమ్మి రష్యా వెళ్లి.. శిక్షణ పేరుతో అక్కడి సైన్యం చెరలో చిక్కుకుపోయిన 9 మంది తెలంగాణావాసులు, ఇద్దరు ఏపీవాసులు ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టి తమ ఇళ్లకు చేరుకున్నారు.
మరో నలుగురు ఇంకా అక్కడే..వారికి రష్యా పౌరసత్వం!
నిజామాబాద్, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఏజెంట్ల మాటలు నమ్మి రష్యా వెళ్లి.. శిక్షణ పేరుతో అక్కడి సైన్యం చెరలో చిక్కుకుపోయిన 9 మంది తెలంగాణావాసులు, ఇద్దరు ఏపీవాసులు ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టి తమ ఇళ్లకు చేరుకున్నారు. విదేశాల్లో ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో తీవ్ర ఆర్థిక సమస్యల మధ్యే పైసా పైసా తెచ్చి డబ్బంతా ఏజెంట్ల చేతుల్లో పెడితే పాపం ఆ యువకులకు రష్యా వెళ్లాక ఊహించని పరిణామం ఎదురైంది. అక్కడ వారంతా బలవంతంగా రష్యా సైన్యంలో చేరాల్సి వచ్చింది. అక్కడ తాము నిర్బంధ శిక్షణ పొందుతున్న విషయాన్ని బాధితులు సోషల్‌మీడియా వేదికగా చెప్పుకొని బోరుమన్నారు. విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ప్రవాసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ, రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీ స్పందించి బాధితులను తిరిగి వారి స్వగృహాలకు చేర్చింది. గురువారం రాత్రి వారంతా ఇళ్లకు చేరుకున్నారు. రష్యా సైన్యం చెర నుంచి బాధితులకు విముక్తి కల్పించడంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రత్యేక చొరవచూపారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లికి చెందిన కస్తూరి తిరుపతి, రెబ్బ భరత్, కిసాన్‌నగర్‌కు చెందిన వరకంటి కార్తిక్, కామారెడ్డికి చెందిన సురేశ్, జగిత్యాల జిల్లా బడా లింగాపూర్‌కి చెందిన గడ్డం శేఖర్, గోరువంతుల లింబాద్రి, కేశాపూర్‌కు చెందిన రాజశేఖర్, సిరిసిల్లకు చెందిన గొల్ల బాలయ్య, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కర్రి నాగార్జున, బొడి గోవింద గురువారం తమ స్వగృహాలకు చేరుకున్నారు. జిల్లాకు చెందిన మరికొంతమంది రష్యా సైన్యంలోనే కొనసాగుతున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన భూక్యా రవీందర్, ధర్పల్లికి చెందిన మెగావత్ ప్రకాశ్, సిరికొండ మండలం పెద్దవాల్గొట్‌కు చెందిన సిర్సు అశోక్, బాన్సువాడకు చెందిన మహ్మద్ అఫ్జల్ ఇంకా అక్కడే చిక్కుకుపోయారు. వీరికి రష్యా తమ దేశ పౌరసత్వం కట్టబెట్టిందని, ఫలితంగా వారిని విడుదల చేయడం కష్టం అని అధికారులు చెబుతున్నట్లు సమాచారం.