Share News

11 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్‌!

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:17 AM

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శాసన మండలి కార్యకలాపాలను అడ్డుకున్న ...

11 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్‌!

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శాసన మండలి కార్యకలాపాలను అడ్డుకున్న 11 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలను మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్‌ చేశారు. ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్‌ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ చైర్మన్‌ పోడియంను చుట్టుముట్టారు. ప్లకార్డులు ప్రదర్శించడం సభ నియమాలకు విరుద్ధమని చైర్మన్‌ పదేపదే గుర్తు చేసినా సభ్యులు వినలేదు. ఇంతవరకు శాసనమండలిలో సభ్యులను సస్పెండ్‌ చేసే పరిస్థితి రాలేదని, అక్కడిదాకా తెచ్చుకోవద్దని చైర్మన్‌ కోరారు. అప్పటికీ బీఆర్‌ఎస్‌ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు వారిని సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు. దయచేసి బయటకు వెళ్లండంటూ పదేపదే కోరారు. వారు చైర్మన్‌ మాట వినకుండా నినాదాలు కొనసాగించడంతో మార్షల్స్‌ వచ్చి బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సస్పెండ్‌ అయిన వారిలో మధుసూదనాచారి, రవీందర్‌రావు, నవీన్‌కుమార్‌రెడ్డి, వంటేరు యాదవరెడ్డి, శంబీపూర్‌ రాజు, దేశపతి శ్రీనివాస్‌, ఎల్‌.రమణ, కోటిరెడ్డి, వాణీదేవి, తాతా మధు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 05:17 AM