Share News

Telangana Government: 10 అంతస్తులు దాటితే టీడీఆర్‌ తప్పనిసరి

ABN , Publish Date - Jan 17 , 2026 | 05:45 AM

అభివృద్ధి బదలాయింపు హక్కు (టీడీఆర్‌) బాండ్లకు డిమాండ్‌ పెంచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది కంటే ఎక్కువ అంతస్తులతో నిర్మించే భవనాలకు టీడీఆర్‌ వినియోగం తప్పనిసరి చేసింది.

Telangana Government: 10 అంతస్తులు దాటితే టీడీఆర్‌ తప్పనిసరి

  • 11వ అంతస్తు నుంచి బిల్టప్‌ ఏరియాలో 10శాతం మేర!

  • టీడీఆర్‌ బాండ్ల గిరాకీ పెంచేలా సర్కారు కీలక నిర్ణయం

  • వినియోగ పరిధి ‘క్యూర్‌’ వరకూ పెంపు.. ఉత్తర్వుల జారీ

  • ప్రభుత్వ విభాగాలపై తగ్గనున్న ఆస్తుల సేకరణ భారం

  • ఎఫ్‌టీఎల్‌ భూములకు 200శాతం.. బఫర్‌జోన్‌ పరిధిలో

  • 300 శాతం.. దానికి ఆవల భూములకు 400శాతం టీడీఆర్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి బదలాయింపు హక్కు (టీడీఆర్‌) బాండ్లకు డిమాండ్‌ పెంచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది కంటే ఎక్కువ అంతస్తులతో నిర్మించే భవనాలకు టీడీఆర్‌ వినియోగం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకూ టీడీఆర్‌ వినియోగానికి అవకాశం ఉండగా.. ఇప్పుడు దానిని కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధి వరకూ పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు (జీవో 16) జారీ చేసింది. పది కంటే ఎక్కువ అంతస్తులతో నిర్మించే భవనంలో.. 11వ అంతస్తు నుంచి ఉండే బిల్టప్‌ ఏరియాలో 10 శాతం టీడీఆర్‌ వినియోగం తప్పనిసరి అని పేర్కొంది. సాధారణంగా రోడ్ల విస్తరణ, మెట్రో, ఫ్లైఓవర్ల వంటివాటి నిర్మాణానికి భూమిని సేకరించేటప్పుడు.. భూ యజమానులకు ప్రభుత్వం నగదుకు బదులుగా.. అదనపు నిర్మాణ హక్కులు కల్పిస్తూ ఇచ్చేవే ఈ టీడీఆర్‌ బాండ్లు. వీటిని సదరు యజమానులు సొంతానికి వాడుకోవచ్చు. లేదా బిల్డర్లకు విక్రయించుకోవచ్చు. అప్పుడా బిల్డర్లు ఆ బాండ్లను ఉపయోగించడం ద్వారా ఎక్కువ ఫ్లోర్‌ స్పేస్‌ పొందుతారు. అయితే.. ఇప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం అదనపు అంతస్తులు నిర్మించాలనుకునేవారు, సెట్‌ బ్యాక్‌ల్లో మినహాయింపు కావాలనుకునేవారు మాత్రమే టీడీఆర్‌ వినియోగానికి ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల టీడీఆర్‌ బాండ్లకుఆశించిన డిమాండ్‌ లేకుండా పోయింది. ఫలితంగా భూసేకరణ సమయంలో పరిహారానికి బదులుగా వాటిని తీసుకునేందుకు భూయజమానులు ముందుకు రావట్లేదు. దీంతో ప్రభుత్వ విభాగాలపై ఆర్థికంగా భారం పడుతోంది. ఈ క్రమంలోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల టీడీఆర్‌ బాండ్లకు డిమాండ్‌ పెరుగుతుందని.. వాటిని తీసుకునేందుకు ఆస్తుల యజమానులు ఆసక్తి చూపుతారని, తద్వారా ప్రభుత్వ విభాగాలపై ఆర్థిక భారం తగ్గుతుంందని జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం అధికారి ఒకరు తెలిపారు.


ఎంత శాతమంటే...

జల వనరుల పరిరక్షణ, వాటి పునరుద్ధరణకు సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా.. టీడీఆర్‌ జారీలో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. కోర్‌ ఏరియా పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, నదుల ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌), గరిష్ఠ నీటి మట్టం (ఎంఎ్‌ఫఎల్‌), బఫర్‌ జోన్‌లో భూములో కోల్పోతున్న వారికి టీడీఆర్‌ జారీలో సవరణలు చేశారు. ఎఫ్‌టీఎల్‌, ఎంఎ్‌ఫఎల్‌ పరిధిలోని పట్టా భూముల యజమానులకు 200 శాతం, బఫర్‌ జోన్‌లో ఉన్న భూములకు 300 శాతం అభివృద్ధి బదలాయింపు హక్కు కల్పించనున్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల కోసం సేకరించే బఫర్‌ జోన్‌ల ఆవల ఉన్న భూములకు 400 శాతం టీడీఆర్‌ ఇవ్వనున్నారు.


సవరణల్లో కొన్ని...

  • ఎఫ్‌టీఎల్‌/ఎంఎ్‌ఫఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో ఉన్న భూములను ఉచితంగా ఇస్తే.. మిగతా స్థలంలో సెట్‌ బ్యాక్‌ల్లో మినహాయింపు, అదనపు అంతస్తు నిర్మాణానికి అవకాశం ఉంటుంది. అగ్నిమాపక శాఖ, ఎయిర్‌ పోర్ట్‌ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి.

  • వివాదస్పద భూములకు టీడీఆర్‌ జారీ చేయరు. అలాంటి భూములకు జారీ చేసిన టీడీఆర్‌లను సంబంధిత అధికారి కస్టోడియన్‌లో ఉంచి భూమి సేకరిస్తారు. భూయజమాన్యపు హక్కు తేలిన అనంతరం.. సంబంధిత వ్యక్తికి టీడీఆర్‌ ఇస్తారు.

  • జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హైడ్రా, ఎంఆర్‌డీసీఎల్‌, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీలు, అర్బన్‌ లోకల్‌ బాడీలు, పారిశ్రామిక ప్రాంతాల లోకల్‌ అథారిటీ (ఐలా)లు చేపట్టే చెరువుల అభివృద్ధి, నదీ తీరప్రాంత ప్రాజెక్టులకు మాత్రమే టీడీఆర్‌లు ఇస్తారు.

  • జల వనరులు, నాలాలకు సంబంధించిన టీడీఆర్‌ జారీకి ముందు ఇరిగేషన్‌, రెవెన్యూ విభాగాల క్లియరెన్స్‌ తప్పనిసరి. నీటి పారుదల శాఖ నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఈఈ), అంతకంటే ఎక్కువ స్థాయి అధికారి, రెవెన్యూ విభాగం నుంచి అదనపు కలెక్టర్‌ స్థాయి అధికారుల నుంచి క్లియరెన్స్‌ తీసుకోవాలి.

  • ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ అయిన చెరువుల వద్ద భూసేకరణకు ఇరిగేషన్‌ ఎన్‌వోసీ అవసరం లేదు.

  • ఎకరం, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోని భూములకు టీడీఆర్‌ జారీకి ముందు ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి.

Updated Date - Jan 17 , 2026 | 05:45 AM