CM Revanth Reddy: 10 రోజులు ‘అరైవ్.. అలైవ్’!
ABN , Publish Date - Jan 12 , 2026 | 03:29 AM
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను తగ్గించాలనే సంకల్పంతో పోలీసు శాఖ ‘అరైవ్.. అలైవ్’ ప్రచార కార్యక్రమాన్ని చేపడుతోంది.
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక ప్రచార కార్యక్రమం
నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా రహదారి భద్రతపై ప్రచారం
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను తగ్గించాలనే సంకల్పంతో పోలీసు శాఖ ‘అరైవ్.. అలైవ్’ ప్రచార కార్యక్రమాన్ని చేపడుతోంది. రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. యూస్‌ఫగూడలోని కోట్ల విజయ భాస్కరరెడ్డి స్టేడియంలో సీఎం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో స్టేడియం సమీప ప్రాంతాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ ప్రచార కార్యక్రమం 13 నుంచి 24 వరకు పండగ సెలవులు మినహా 10 రోజులు నిర్వహిస్తున్నామని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రోడ్డు భద్రత ప్రాముఖ్యతను ప్రతి పౌరుడి మనసులో బలంగా నాటేందుకే అరైవ్ అలైవ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో హోంగా ర్డు నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రజలకు సురక్షిత డ్రైవింగ్ సంస్కృతిని అలవాటు చేసి, రోడ్డు భద్రతా వ్యవస్థలను పటిష్ఠం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ప్రముఖులు, మీడియా, ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో రోడ్డు భద్రతలో తెలంగాణను దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది తమ ధ్యేయమని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, కార్లలో సీటు బెల్టులు పెట్టుకోకపోవడం, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ వాడడం, మద్యం సేవించి నడపడం, సిగ్నల్ జంప్, స్టాప్ లైన్ దాటడం, హైవేలపై ఆటోల ఓవర్ లోడింగ్, ఎడమవైపు నుంచి ఓవర్ టేకింగ్ వంటి ప్రమాదకర అలవాట్లపై ఈ ప్రచారంలో ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. జిల్లా స్థాయిలో పోలీసు కమిషనర్ లేదా ఎస్పీల నేతృత్వంలో, గ్రామాల్లో సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామ ట్రాఫిక్ సేఫ్టీ కమిటీల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించనున్నామని చెప్పారు.