Share News

నకిలీ పత్రాల సృష్టికి రూ.8 కోట్లు

ABN , Publish Date - Jun 01 , 2026 | 04:24 AM

వెయ్యి కోట్ల రూపాయల భూకుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు..

నకిలీ పత్రాల సృష్టికి రూ.8 కోట్లు

  • 1000 కోట్ల భూకుంభకోణం సూత్రధారి రాధాకృష్ణకు ఇచ్చిన ఏపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

  • పరారీలో ఉన్న బొల్లా కోసం 4 పోలీసు బృందాల గాలింపు

  • రాధాకృష్ణపై 9 క్రిమినల్‌ కేసులు

  • ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన వైనం

  • హైడ్రా కమిషనర్‌ సంతకమూ ఫోర్జరీ

  • కేసు వివరాలు వెల్లడించిన డీసీపీ

ఙహైదరాబాద్‌ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): వెయ్యి కోట్ల రూపాయల భూకుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. అందుకు అవసరమైన నకిలీ పత్రాలను సృష్టించడం కోసం లాయర్‌ రాధాకృష్ణకు రూ.8 కోట్లు ముట్టజెప్పినట్టు శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కుంభకోణంలో బొల్లా ప్రమేయంపై పక్కా ఆధారాలు లభ్యమయ్యాయని.. దీని గురించి బయటపడగానే ఆయన ఫోన్లు స్విచాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెప్పారు. పరారీలో ఉన్న ఆయన కోసం 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్నారు. ఆదివారం ఆయన సైబరాబాద్‌ కమిషనరేట్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసు వివరాలు వెల్లడించారు. తాము ఏ భూమికి సంబంధించి కొనుగోలు ఒప్పందం చేసుకుంటున్నామో అది ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా.. బ్రహ్మనాయుడు దాన్ని అక్రమంగా సొంతం చేసుకునే యత్నం చేశారని.. నకిలీ జీవోల సంగతి ఆయనకు తెలుసని డీసీపీ స్పష్టం చేశారు. నకిలీ పత్రాల తయారీ నిమిత్తం రాధాకృష్ణ బృందానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని.. అగ్రిమెంట్‌ చేసుకునేందుకు నిమ్మల కుటుంబానికి కూడా బ్రహ్మనాయుడు, రమేశ్‌ల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు బదిలీ అయిందని తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన నిమ్మల కుటుంబ సభ్యులు, రాధాకృష్ణ ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం.. కుంభకోణంలో బ్రహ్మనాయుడు ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైందన్నారు. ప్రభుత్వ భూమి తమదని వాదిస్తున్న నిమ్మల కుటుంబసభ్యులు స్థానికులని, దీనిపై వీరు కోర్టులో కేసు వేశారని తెలిపారు. బ్రహ్మనాయుడు ప్రమేయంతోనే.. స్థానికుడు కాని కమాను నాగేశ్వరరావు అనే వ్యక్తి పేరుపై 1.20 ఎకరాలను బదిలీ చేస్తున్నట్లు నకిలీ జీవో (నంబరు 558) సృష్టించారని తెలిపారు. బ్రహ్మనాయుడుతోపాటు పరారీలో ఉన్న మరో నలుగురి కోసం వేట కొనసాగుతోందన్నారు. బ్రహ్మనాయుడును అరెస్ట్‌ చేసేందుకు పల్నాడు ఎస్పీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ఏపీ పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇక.. ఈ కుంభకోణాన్ని ముందుండి నడిపించిన కీలక సూత్రధారి, నకిలీజీవోల సృష్టికర్త రాధాకృష్ణను, అతడికి సహకరించిన అతడి డ్రైవర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. అతణ్ని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.


మోసాలే ప్రవృత్తి..

లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్న రాధాకృష్ణ మోసాలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టు డీసీపీ తెలిపారు. సచివాలయంలో ఐటీ శాఖలో అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పి పరిచయాలు పెంచుకునేవారని.. అర్హత లేకున్నా తన పేరు ముందు డాక్టర్‌ అని పెట్టుకున్నారని చెప్పారు. తన పలుకుబడితో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకుని.. రాధాకృష్ణ పలువురిని మోసం చేసినట్టు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒకరిని మోసం చేసిన కేసులో అంబర్‌పేట పోలీసులు 2015లో రాధాకృషను అరెస్టు చేసి జైలుకు పంపారు. అలాగే.. సచివాలయంలో అటెండర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వెంకటాచారి అనే వ్యక్తి నుంచి రూ.18 లక్షలు వసూలు చేసి, మోసగించిన రాధాకృష్ణపై నల్గొండ టూ టౌన్‌లో కేసు నమోదైంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అటెండర్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మొయినాబాద్‌కు చెందిన దివాకర్‌ అనే వ్యక్తి నుంచి రూ.3 లక్షలు తీసుకొని మోసం చేసిన వైనంపై అక్కడి పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. ఇలా రాధాకృష్ణపై 9మోసం కేసులు నమోదై ఉన్నాయని డీసీపీ తెలిపారు. మోసాలు చేయడమే పనిగా పెట్టుకున్న రాధాకృష్ణకు బ్రహ్మనాయుడుతో పరిచయం ఏర్పడిందని.. తన పరిచయాలతో భూమిని రెగ్యులైజ్‌ చేయిస్తానని చెప్పిన ఆయన.. బ్రహ్మనాయుడు నుంచి రూ.8 కోట్లు తీసుకున్నారని చెప్పారు. రాధాకృష్ణకు మరో న్యాయవాది, మరో వ్యక్తి సహకరించారని త్వరలో వారినీ అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. నకిలీ జీవోల విషయం వెలుగులోకి రాగానే.. వాటిని ధ్వంసం చేయాల్సిందిగా రాధాకృష్ణ తన డ్రైవర్‌ ప్రవీణ్‌కు చెప్పారని, వారు ఆ ప్రయత్నంలో ఉండగానే అరెస్టు చేశామని వెల్లడించారు. రాధాకృష్ణ నుంచి 31 డాక్యుమెంట్లు, 13స్టాంపులు, 7పాస్‌బుక్‌లు, 12 చెక్‌బుక్‌లు, 3ల్యాప్‌టా్‌పలు, 3 ఐప్యాడ్‌లు, 2 ఫోన్లు సీజ్‌ చేశామన్నారు. అధికారుల సంతకాలను రాధాకృష్ణ ఫోర్జరీ చేసేవారని, అందులో భాగంగా అధికారుల సంతకాలను ప్రాక్టీస్‌ చేసినట్టుగా ఉన్న రెండు పుస్తకాలను సైతం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించామన్నారు. ఇంతటి నేర చరిత్ర ఉన్న రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాల్సిందిగా బార్‌ కౌన్సిల్‌కు లేఖ రాస్తామన్నారు.

పేరులో అక్షరం మార్చి..

తన మోసాలు బయటపడితే అరెస్టయ్యే ప్రమాదం ఉండడంతో రాధాకృష్ణ విదేశాలకు పారిపోయేందుకు సిద్ధమైనట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే.. అంబర్‌పేట అడ్ర్‌సతో 2013లోనే పాస్‌పోర్టు తీసుకున్నప్పటికీ.. తన పేరులో కొత్తగా ఒక అక్షరాన్ని చేర్చి, పత్రికల్లో ప్రకటన ఇచ్చి కొత్తపేరుతో చాంద్రయణగుట్ట అడ్ర్‌సతో కొత్త పాస్‌పోర్ట్‌ తెచ్చుకున్నారని చెప్పారు. తన భార్యకు కూడా పాస్‌పోర్ట్‌ తయారు చేయించినట్టు తెలిపారు.

Updated Date - Jun 01 , 2026 | 04:24 AM