Share News

కో ఆప్షన పదవులకు 10 నామినేషన్లు

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:30 AM

నగరపాలకసంస్థలోని ఐదు కో ఆప్షన పదవుల కోసం 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. గురువారం నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండగా మంగళవారం వరకు ఒక్కరు కూడా నామినేషన

కో ఆప్షన పదవులకు 10 నామినేషన్లు

కరీంనగర్‌ టౌన, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): నగరపాలకసంస్థలోని ఐదు కో ఆప్షన పదవుల కోసం 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. గురువారం నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండగా మంగళవారం వరకు ఒక్కరు కూడా నామినేషన వేయలేదు. కార్పొరేషనలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నుంచి కో ఆప్షన పదవులను ఆశించే వారు ఆ పార్టీ ప్రకటించిన ఫైవ్‌మెన కమిటీకి దరఖాస్తులు ఇవ్వాలని సూచించింది. దీంతో ఒకరిద్దరు మినహా మిగిలిన పోటీకి సిద్దపడుతున్న ఔత్సాహిక అభ్యర్థులంతా ఆ కమిటీకే వారి దరఖాస్తులు ఇచ్చారు. ఐదు స్థానాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వాటిలో నుంచి అర్హులైన వారితో ఐదుగురు కమిటీ సభ్యులు షార్ట్‌ లిస్ట్‌ తయారు చేసి కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌కు పంపించినట్లు తెలిసింది. మంత్రి బండి సంజయ్‌ ఎవరి పేరు చెబితే వారే కార్పొరేషనలో నామినేషన్లు దాఖలు చేయాలని సూచించినట్లు తెలిసింది. అయినా ఒకరిద్దరు ఫైవ్‌మెన కమిటీకి వారిపేర్లను పరిశీలించాలని కోరుతూనే కార్పొరేషనలోనూ నామినేషన్లను సమర్పించారు. ఇక బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయాలనుకునే వారు నేరుగా కార్పొరేషనలో నామినేషన్లను దాఖలు చేశారు. మరోవైపు అన్ని పార్టీల కార్పొరేటర్ల మద్దతు కూడగట్టుకొని గురువారం నామినేషన్లు వేయాలని మరికొందరు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది.

ఫ నామినేషన్లు దాఖలు చేసింది వీరే..

అజీమ్‌ మహ్మద్‌, మాజీ కార్పొరేటర్లు నాంపల్లి శ్రీనివాస్‌, నక్క పద్మ, దిండిగాల మహేశ, వరాల నారాయణ, చిగిరి వెంకటమ్మ, లింగంపల్లి శ్రీనివాస్‌, మాజీ కో ఆప్షన సభ్యుడు కన్న కృష్ణ, స్వర్గం విజయ, చిందం శ్రీనివాస్‌ బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ కార్పొరేటర్లు గందె మాధవి మహేశ, జంగిలి సాగర్‌, బోనాల శ్రీకాంతతోపాటు మరికొందరు, కాంగ్రెస్‌ నుంచి మాజీ కార్పొరేటర్లు అర్ష మల్లేశం, పడిశెట్టి భూమయ్య తదితరులు కూడా కో ఆప్షన కోసం అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పోటీ చేయాలనుకునే వారు పార్టీలకతీతంగా భేటీ అయి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అన్ని పార్టీల మద్దతుతో కో ఆప్షన పదవులను దక్కించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఎంత మంది పోటీలో ఉన్నారో గురువారం తేలుతుంది.

Updated Date - Apr 16 , 2026 | 12:30 AM