విద్యుత్తు ఉద్యోగి కుటుంబానికి కోటి బీమా సొమ్ము
ABN , Publish Date - Jun 04 , 2026 | 06:18 AM
ఉత్తర డిస్కమ్(ఎన్పీడీసీఎల్-వరంగల్) పరిధిలో ప్రమాదవశాత్తూ మృతిచెందిన లైన్‌మెన్ ఎస్.ప్రమోద్‌కుమార్ సతీమణికి బుధవారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క....
చెక్కును అందజేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఉత్తర డిస్కమ్(ఎన్పీడీసీఎల్-వరంగల్) పరిధిలో ప్రమాదవశాత్తూ మృతిచెందిన లైన్‌మెన్ ఎస్.ప్రమోద్‌కుమార్ సతీమణికి బుధవారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రూ.కోటి ప్రమాద బీమా చెక్కును అందించారు. బాసర పరిధిలో పనిచేస్తున్న ప్రమోద్‌కుమార్ గత మార్చి 24న విధి నిర్వహణలో ఉండగా ప్రమాద ఘటనలో చనిపోయారు. ఈ క్రమంలో రూ.కోటి ప్రమాద బీమా మొత్తం గత మే 30న నామినీ ఖాతాలో జమ అయింది. ఇప్పటికే సింగరేణి లో తొలుత ఈ పథకం ప్రారంభం కాగా... ఆ తర్వాత విద్యుత్ సంస్థలకు వర్తింపచేశారు. తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు కూడా రూ.కోటి ప్రమాదబీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర డిస్కమ్‌తో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యుఎ్‌సఎ్‌సఏ-2/యుఎ్‌సఎ్‌సఏ-3 పథకాల కింద వేతన ఖాతాలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా పథకం అమలవుతుంది. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్‌రెడ్డి, డైరెక్టర్(ఫైనాన్స్) తిరుపతిరెడ్డి, యూనియన్ బ్యాంకు సీఈవో ఆశీష్ పాండే తదితరులు పాల్గొన్నారు.