Share News

రూ.కోటి కట్నం ఇవ్వలేదని వివాహం రద్దు

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:46 AM

రూ.కోటి కట్నం ఇవ్వలేదనే కారణంతో అర్ధంతరంగా పెళ్లి రద్దు చేశారని పెళ్లికుమార్తె కుటుంబసభ్యులు పెళ్లి కుమారుడి ఇంటిపై దాడి చేశారు.

రూ.కోటి కట్నం ఇవ్వలేదని వివాహం రద్దు

  • వరుడి ఇంటిపై వధువు కుటుంబసభ్యుల దాడి

  • ఇరువర్గాల పరస్పర ఫిర్యాదులతో కేసు నమోదు

బంజారాహిల్స్‌, ఏప్రిల్‌ 26 (ఆంద్రజ్యోతి): రూ.కోటి కట్నం ఇవ్వలేదనే కారణంతో అర్ధంతరంగా పెళ్లి రద్దు చేశారని పెళ్లికుమార్తె కుటుంబసభ్యులు పెళ్లి కుమారుడి ఇంటిపై దాడి చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదుతో ఈ వివాదం పోలీ్‌సస్టేషన్‌కు చేరింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. బుద్వేల్‌కు చెందిన విజయ నిర్మల కుమార్తె అఖిలకు, జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన పెండ్యాల అక్షయ్‌తో వివాహం నిశ్చయమైంది. మొదట కట్నం వద్దన్న అక్షయ్‌ తల్లి ఉష, తండ్రి సుధాకర్‌, తమ కూతురు కీర్తి నిశ్చితార్థం అయ్యాక మాట మార్చారని పేర్కొంటూ విజయ నిర్మల జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 1 కోటి నగదు, బీఎమ్‌డబ్ల్యూ కారు, ఖరీదైన వాచీ కావాలని డిమాండ్‌ చేశారని తెలిపారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేయించుకున్నాక, ఏప్రిల్‌ 5న అకస్మాత్తుగా పెళ్లి రద్దు చేశారని ఆరోపించారు. కట్నం కోసం పెళ్లి రద్దు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు పెళ్లి కుమార్తె తల్లి విజయ నిర్మల, ఆమె కుమారుడు సుమేధ్‌ మరో 70 మందితో కలిసి జూబ్లీహిల్స్‌లోని తమ ఇంటిపై దాడి చేశారని పెళ్లికుమారుడి తండ్రి సుధాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి గేట్లు విరగ్గొట్టి, ఫర్నిచర్‌, సీసీ కెమెరాలను ధ్వంసం చేయడమే కాకుండా, తమను చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఇరు కుటుంబాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 27 , 2026 | 04:46 AM