ఏఐపీసీ చైర్మన్గా మధుయాష్కీ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:07 AM
అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్గా మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్గా మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని ఏఐసీసీ భవన్లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు ఏఐపీసీ మాజీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. ఏఐపీసీ చైర్మన్ పదవిని ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించిన.. ‘బోధించు-సమీకరించు-పోరాడు’ సూత్రంతో దేశంలో 50 వేల సభ్యత్వంతోపాటు అభివృద్ధి చెందిన 100 అర్బన్ జిల్లాల్లో ఏఐపీసీ కమిటీల విస్తరణకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న మోదీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా ప్రొఫెషనల్స్ను భాగస్వాములను చేస్తామన్నారు. రాహుల్ గాంధీ విజన్కు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువల పెంపుదలకు కృషి చేస్తామని తెలిపారు. ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా వీడియో కాల్ ద్వారా అభినందనలు తెలిపారు.