Share News

వైభవ్‌ను ఎక్కడ ఆడించాలి?

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:00 AM

ఐర్లాండ్‌ చేతిలో భారత జట్టు టీ20 సిరీస్‌ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరాభవానికి బ్యాటింగ్‌ వైఫల్యమే కారణమంటూ ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైభవ్‌ను ఎక్కడ ఆడించాలి?

న్యూఢిల్లీ: ఐర్లాండ్‌ చేతిలో భారత జట్టు టీ20 సిరీస్‌ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరాభవానికి బ్యాటింగ్‌ వైఫల్యమే కారణమంటూ ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో అద్భుత ఫామ్‌లో ఉన్న 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీని ఇకనైనా తుది జట్టులో చేర్చాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి వైభవ్‌ ఆటను చూసేందుకే బెల్‌ఫాస్ట్‌ మైదానం కిక్కిరిసిపోయింది. అటు టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై కూడా ఒత్తిడి పెరుగుతోంది. కానీ టీ20 వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచిన జట్టులో వైభవ్‌ను ఎక్కడ ఆడించాలనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఓపెనర్లు అభిషేక్‌, శాంసన్‌ ఆ మెగా టోర్నీలో విశేషంగా రాణించడంతో ఐర్లాండ్‌తో సిరీస్‌‌కు కొనసాగించారు. ఇక బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు టీ20ల సిరీస్‌ కోసం ఎలాంటి కాంబినేషన్‌తో వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఓపెనింగ్‌ జోడీని మార్చకూడదనుకుంటే, వన్‌డౌన్‌లో వైభవ్‌ను ఆడించి.. ఆ తర్వాత ఇషాన్‌, శ్రేయాస్‌, తిలక్‌, దూబే, అక్షర్‌లను దింపాల్సి ఉంటుంది. దీంతో సూర్యాన్ష్‌పై వేటు పడుతుంది. అయితే రెండు మ్యాచ్‌ల్లో ఐదు పరుగులే చేసిన శాంసన్‌ను పక్కనబెడితే వైభవ్‌ను ఓపెనర్‌గా ఆడించవచ్చనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

ఓటమిని నమ్మలేకున్నాం: కోచ్‌ డష్కాటే

ఐర్లాండ్‌ చేతిలో వైట్‌వాష్‌ కావడాన్ని తాము నమ్మలేకపోతున్నట్టు భారత జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ టెన్‌ డష్కాటే అన్నాడు. ‘రెండు వరుస టీ20 వరల్డ్‌కప్‌లను గెలిచిన జట్టు మాది. అయినా తమ ప్రణాళికలను అద్భుతంగా అమలు చేసిన జట్టు చేతిలో ఓడామని చెప్పవచ్చు. ఇక్కడి పరిస్థితులకు మేం అలవాటు పడకపోవడమే అసలు కారణం’ అని తెలిపాడు. ఇక అరంగేట్రానికి వైభవ్‌ సిద్ధంగానే ఉన్నా, అతడి కోసం శాంసన్‌ను పక్కనబెట్టలేమని తేల్చాడు.

Updated Date - Jun 30 , 2026 | 04:00 AM