చిన్నోడుశతక్కొట్టినా..
ABN , Publish Date - Apr 26 , 2026 | 03:49 AM
టీనేజర్ వైభవ్ సూర్యవంశీ (37 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 103) మెరుపు శతకంతో మెరిసినప్పటికీ.. రాజస్థాన్ రాయల్స్‌కు తమ సొంత....
వైభవ్ 36 బంతుల సెంచరీ వృథా
రాజస్థాన్‌పై సన్‌రైజర్స్‌దే గెలుపు
చెలరేగిన ఇషాన్, అభిషేక్
జైపూర్: టీనేజర్ వైభవ్ సూర్యవంశీ (37 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 103) మెరుపు శతకంతో మెరిసినప్పటికీ.. రాజస్థాన్ రాయల్స్‌కు తమ సొంత మైదానంలో ఓటమి తప్పలేదు. భారీ ఛేదనలో ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), అభిషేక్ శర్మ (29 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 57) నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. దీంతో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్లతో గెలిచింది. ఈ జట్టుకిది వరుసగా నాలుగో విజయం. ముందుగా రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 228 పరుగులు చేసింది. సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీకి తోడు ధ్రువ్ జురెల్ (35 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 51), ఫెరీరా (16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 33) రాణించారు. ఛేదనలో హైదరాబాద్ 18.3 ఓవర్లలో 229/5 స్కోరు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఇషాన్ కిషన్ నిలిచాడు.
సెంచరీ భాగస్వామ్యం: భారీ ఛేదనలో సన్‌రైజర్స్ తొలి ఓవర్‌లోనే హెడ్ (6) వికెట్‌ను కోల్పోయింది. కానీ అభిషేక్, ఇషాన్ జోడీ రెండో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు దిశగా నడిపించింది. ప్రత్యర్థి ఫీల్డింగ్ వైఫల్యం కూడా సన్‌రైజర్స్‌కు కలిసొచ్చింది. ఈ ఇద్దరూ ఎడాపెడా షాట్లు బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 89/1 స్కోరుతో పటిష్టంగా నిలిచింది. చెరో 24 బంతుల్లో అభిషేక్, ఇషాన్ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వీరు వెనుదిరిగినా.. క్లాసెన్ (29), నితీశ్ (36) ఆఖర్లో జోరు చూపారు. వీరిద్దరూ 18వ ఓవర్‌లో అవుటయ్యారు. కానీ అప్పటికే రైజర్స్ గెలుపు ఖరారవడంతో 9 బంతులుండగానే మ్యాచ్ ముగిసింది.

వైభవ్ శతక బాదుడు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో చిచ్చరపిడుగు వైభవ్ విజృంభించాడు. కుదిరితే సిక్స్ లేదంటే ఫోర్ అనే తరహాలో అతడి విధ్వంసం సాగింది. ఏకంగా 12 సిక్సర్లతో విరుచుకుపడిన అతడి సెంచరీలో బౌండరీల ద్వారానే 92 రన్స్ సమకూరాయి. అయితే వైభవ్‌కు మరో ఎండ్ నుంచి దూకుడైన సహకారం లభించలేదు. దీనికి తోడు సన్‌రైజర్స్ బౌలర్లు చివరి ఐదు ఓవర్లలో 44 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశారు. ఉప్పల్‌లో తనను డకౌట్ చేసిన పేసర్ ప్రఫుల్‌ను లక్ష్యంగా చేసుకున్న వైభవ్ వరుసగా 4 సిక్సర్లతో పరుగుల ఖాతాకు తెర తీశాడు. అటు మరో ఓపెనర్ జైస్వాల్ (10) మూడో ఓవర్‌లోనే వెనుదిరిగినా.. జురెల్ సహకరించాడు. ఓ సిక్సర్‌తో 15 బంతుల్లోనే వైభవ్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, పవర్‌ప్లేలో రాజస్థాన్ 76/1 స్కోరుతో నిలిచింది. మధ్య ఓవర్లలో కమిన్స్, సకీబ్ కాస్త కట్టడి చేశారు. అయితే స్పిన్నర్ శివాంగ్ ఓవర్‌లో 6,4 పేసర్ మలింగ ఓవర్‌లో 6,4తో వైభవ్ మాత్రం ధాటిని ప్రదర్శించాడు. అటు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జురెల్‌ను నితీశ్ అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే సకీబ్ ఓవర్‌లో వైభవ్ వరుసగా 6,4,4తో 36 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేశాడు. కానీ అదే ఓవర్‌లో ఎల్బీగా వెనుదిరగడంతో అతడి మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత రాయల్స్ ఆటలో పదును తగ్గింది. 14 ఓవర్లలో 175/3 స్కోరుతో ఉండగా.. 250 ఖాయమనిపించింది. కానీ పేసర్లు కమిన్స్, ప్రఫుల్ రన్స్‌ను నియంత్రించారు. పరాగ్ (7) విఫలం కాగా.. 18వ ఓవర్‌లో ఫెరీరా 6,4,6తో 18 రన్స్‌తో కదలిక తెచ్చాడు. కానీ ఆఖరి రెండు ఓవర్లలో 15 పరుగులే రాగా ఫెరీరా, హెట్‌మయెర్ (11) వికెట్లను కోల్పోయింది.
తక్కువ ఇన్నింగ్స్ (26)లోనే నాలుగు టీ20 శతకాలు బాదిన ప్లేయర్‌గా వైభవ్. కాగా, నిరుడు ఐపీఎల్‌లో కూడా వైభవ్ సెంచరీ చేశాడు. అలాగే తక్కువ బంతుల్లోనే (473) టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేయడంతో పాటు, పిన్నవయస్సులోనే (15ఏళ్లు) ఈ ఫీట్ సాధించిన బ్యాటర్ అయ్యాడు.